టిడిపి కూటమి ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈరోజు విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో టిడిపి కూటమి దెబ్బకు అధికార వైకాపా కకావికలం అవుతోంది. దాదాపు టిడిపి పోటీ చేసిన ప్రతిచోటా ఆ పార్టీ, ఆ పార్టీ మిత్రులు విజయం వైపు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ప్రతిపక్ష టిడిపి కూటమి 153 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టిడిపి 132 చోట్ల, జనసేన 15, బిజెపి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార వైకాపా కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆధక్యంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో టిడిపి కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. రాయలసీమలో బలంగా ఉన్నదని భావించిన అధికార వైకాపా ఇక్కడ కూడా చతికిలపడింది. 52 స్థానాలు ఇక్కడ ఉండగా టిడిపి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో టిడిపి కూటమి దూసుకుపోతోంది. టిడిపి కూటమికి దాదాపు 55శాతం ఓట్లు వస్తుండగా, వైకాపాకు కేవలం 39శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయి. అంటే రెండు పార్టీల మధ్య దాదాపు 17శాతం ఓట్ల తేడా ఉంది. వివిధ సర్వే సంస్థలు అంచనా వేసిన ఫలితాల కంటే టిడిపి కూటమి అంచనాలకు అందని విధంగా విజయం వైపు దూసుకుపోతోంది. స్థానిక సర్వే సంస్థ కెకె చెప్పిన విధంగానే టిడిపి కూటమి 161 స్థానాలవైపు వేగంగా పయనిస్తోంది. కెకె చెప్పినట్లు వైకాపా కేవలం 14 స్థానాలకే పరిమితం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా దాదాపు అందరూ మంత్రులు ఓటమివైపు పయనిస్తున్నారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, జోగిరమేష్, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌యాదవ్, రజనీ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వంటి హోమాహెమీలు ఓటమిబాటలో ఉన్నారు. మీద..నిన్నటి దాకా తమదే విజయమని విర్రవీగిన వైకాపా నేతలకు ప్రజలు కొర్రుకాల్చి వాతపెట్టారనడంలో సందేహం లేదు.