నూతన సిఎస్ ఎవరు...?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతోంది. ఇందులో భాగంగా ముందుగా నిన్నటి వరకూ వైకాపా అధినేత జగన్‌కు ఏజెంట్‌గా పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్‌ను ఎంపికచేయబోతోంది. నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నేడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడును సిఎస్ జవహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి వ్యవహారశైలి పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని, తాను ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత మిగతా సంగతులు చూస్తానని, అప్పటి వరకూ ప్రభుత్వానికి చెందిన ఎటువంటి దస్త్రాలు బయటకు వెళ్లనీయవద్దని ఆదేశించారని తెలుస్తోంది. జగన్‌కు ఏజెంట్‌గా పనిచేసిన జవహర్‌రెడ్డిని నేడో రేపో తప్పించి ఆయన స్థానంలోమరో సీనియర్ ఐఏఎస్‌ను ప్రభుత్వ కార్యదర్శిగా నియమిస్తారని తెలుస్తోంది. అయితే..ఎవరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారో తెలియడం లేదు. సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంటే..జవహర్‌రెడ్డి తరువాతీ నీరబ్‌కుమార్‌ప్రసాద్,పూనం మాలకొండయ్య, వై.శ్రీలక్ష్మి, కరికాలవలన్, రజిత్‌భార్గవ, అనంతరాము,జి.సాయిప్రసాద్, ఆర్.పి.సిసోడియాలు ఉన్నారు.
వీరిలో నీరబ్‌కుమార్ ప్రసాద్ ఈనెలాఖరుకు రిటైర్‌కాబోతున్నారు. అందువలన ఆయనను సిఎస్‌గా నియమించే అవకాశం లేదు. ఆ తరువాత ఉన్న పూనం మాలకొండయ్య ఉన్నారు. అయితే ఆమెను చంద్రబాబు ఎంపిక చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు ఆమె అత్యంత నిజాయితీకలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఆమె వ్యవహారశైలి మారిపోయిందని, జగన్ ఏది చెబితే..అదే చేశారనే, పైగా జగన్ దేవుడని, తాను జగన్‌కు సోదరి అవుతానని అభివర్ణించుకున్నారు. మంచిపోస్టు కోసం ఆమె అన్నీ వదిలేశారని, గతంలో ఉన్న నిజాయితీని కూడా పక్కనపెట్టేశారనే మాట ఐఏఎస్ వర్గాల నుంచే వస్తోంది. దీంతో ఆమెను సిఎస్‌గా తీసుకునే పరిస్థితి లేదు. ఇక ఆమె తరువాత స్థానంలో ఉన్న వై.శ్రీలక్ష్మి అత్యంత వివాదాస్పద అధికారి. గతంలో ఓబులాపురం గనుల కేసులో జైలుకు వెళ్లివచ్చిన ఆమె, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ నుంచి ఆంధ్రా క్యాడర్‌కు వచ్చారు. అయితే ఆమె గతంలో చేసిన తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలేదు. జగన్ ఆడమన్నట్లు ఆడారని, జగన్ కోసం అడ్డగోలుగా వ్యవహరించారని, నిజాయితీ లోపించిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. జగన్ కోసమే పనిచేసే ఆమెను చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో సిఎస్‌ను చేయరు. పై ముగ్గురిని తప్పిస్తే తరువాత స్థానంలో ఉన్న కరికాలవలన్‌కు పెద్దగా సర్వీస్ లేదు. తరువాత ఉన్న రజిత్‌భార్గవవైపు చంద్రబాబు దృష్టి సారించవచ్చు. ఆయన కాకపోతే సాయిప్రసాద్, అజయ్‌జైన్, సిసోడియాలు ఉన్నారు. వీరిలో సిసోడియాకు చంద్రబాబు అవకాశం ఇవ్వవచ్చు.మొత్తం మీద జవహర్‌రెడ్డిని సాగనంపి ఆయన స్థానంలో మరో సీనియర్‌ను చంద్రబాబు సిఎస్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.