ప్రత్యేకహోదా వస్తుందా...!?
కలిసొచ్చేకాలానికి నడిచివచ్చే కొడుకు వస్తాడనట్లు..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రా రాత కూడా మారిపోతోంది. దుర్మార్గ, దుష్టపాలన నుంచి బయటపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుతం కేంద్రంలో నెలకొన్న పరిస్థితులు ఆంధ్రాకు కలిసివస్తాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. నాడు కాంగ్రెస్, బిజెపి కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విడతీశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కునారిల్లుతోంది. 2014 నుంచి 2018 వరకు టిడిపి, బిజెపిల సఖ్యతతో విభజన గాయాలు కొంత వరకు మానుపడినా..తరువాత బిజెపి, టిడిపి అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలు ఆంధ్రాను ఘోరంగా దెబ్బతీశాయి. నాడు చంద్రబాబును ఓడించడానికి జగన్‌కు సహకరించడంతో పాటు, తరువాత ఆయన చేసిన అఘోరమైన పాలనకు బిజెపి పెద్దలు మద్దతు ఇచ్చి ఆంధ్రాను ఘోరంగా దెబ్బతీశారు. మరో 50ఏళ్లలో కూడా పూడ్చలేని నష్టాన్ని జగన్ చేస్తోన్నా బిజెపి పెద్దలు నోరెత్తకుండా ఆయనకు సహకరించి ఆంధ్రాను నాశనం చేశారు. అయితే...కాలం చేసిన గాయాలను కాలమే తీర్చనున్నట్లు ఒక్కసారిగా కేంద్రంలో పరిస్థితులు మారిపోయాయి. నిన్నటిదాకా అజేయుడనుకున్న మోడీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఒక్కసారిగా ఆంధ్రాలో ప్రజలు ఇచ్చిన అమోఘమైన తీర్పుతో చంద్రబాబు బలవంతుడిగా మారిపోయారు. కేంద్రంలో అధికార దండం ఎవరి చేతికి ఇవ్వాలో నిర్ణయించే స్థాయికి ఆయన చేరారు. దీంతో ఇప్పుడు కేంద్రంలో ఏర్పాటు కాబోయే ఎన్‌డిఏ ప్రభుత్వం చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితికి చేరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో బిజెపి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే అవకాశం ఆంధ్రాకు వచ్చింది. నిన్న మొన్నటిదాకా చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే నిరాకరించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆయన పక్కన లేకపోతే..అధికారం పోతుందేమోనన్న బెంగతో చంద్రబాబు చేతిని వదలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఆసరా చేసుకుని చంద్రబాబు గతంలో బిజెపి, కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేకహోదాపై ఒత్తిడి తేవడానికి అవకాశం కల్గింది. ఇప్పుడు చంద్రబాబు మాటను మోడీ జవదాటలేని పరిస్థితి. నితీష్‌కుమార్ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరద్దరూ కలిసి ఎన్‌డిఎపై ఒత్తిడి తెస్తే ఆంధ్రాతోపాటు బీహార్‌కు కూడా ప్రత్యేకహోదా వస్తుంది. ప్రత్యేకహోదానే చంద్రబాబు గత డిమాండ్ కనుక దాన్ని నెరవేరిస్తే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పటిష్టంగా ఉంటుందని రాజధాని ఢిల్లీలోని ఇంగ్లీష్, హిందీ, బిజినెస్ పత్రికలు ఘోషిస్తున్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ మంచి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ఆంధ్రా ప్రజలు వివేకంతో ఓటువేసి, తమ ధీర్ఘకాలిక డిమాండ్‌తో పాటు, రాష్ట్రాభివృధ్దిని సాధించుకునేపరిస్థితుల్లో ఉన్నారు.