లేటెస్ట్

‘విజ‌య‌మ్మ’ మీటింగ్ వెనుక ‘కెవీపీ’...?

స్వ‌ర్గీయ ‘వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి’ 12వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకుని వ‌చ్చే నెల 2వ తేదీన ఆయ‌న స‌తీమ‌ణి ‘వై.ఎస్.విజ‌య‌మ్మ’ ఒక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ‘వై.ఎస్’. జీవించి ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు స‌న్నిహితులుగా పేరు తెచ్చుకున్న‌వారంద‌రినీ ఈ స‌మావేశానికి ‘విజ‌య‌మ్మ’ ఆహ్వానించారు. గ‌త 12 సంవ‌త్స‌రాల నుంచి ఎప్పుడు ఇటువంటి స‌మావేశాన్ని నిర్వ‌హించ‌ని ‘విజ‌య‌మ్మ’ ఇప్పుడు ఎందుకు ఈ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారో అన్న దానిపై రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తి రేకెత్తుతోంది. ఈ స‌మావేశం ఉద్దేశ్యం ఏమిటి...? ఎందుకు వీరంద‌రినీ ఆహ్వానిస్తున్నారు...? ఎవ‌రికి మేలు చేయ‌డానికి ఈ స‌మావేశం అనే ప్ర‌శ్న‌లు వారిలో ఉన్నాయి. తెలంగాణ‌లో త‌న కుమార్తె ఏర్పాటు చేసిన పార్టీకి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేద‌ని, అక్క‌డ ఆ పార్టీని ఎలా బ‌ల‌ప‌ర‌చాల‌నేదానిపై వైఎస్ స‌న్నిహితుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు, వారి స‌హ‌కారం తీసుకునేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఆంధ్రాలో అధికారంలో ఉన్న ‘జ‌గ‌న్’ ప్ర‌భుత్వంపై న‌లువైపుల నుంచి తీవ్ర‌విమ‌ర్శ‌లు వ‌స్తూండ‌డంతో, ఆ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఆప‌ద‌ల‌ను తొల‌గించే మార్గాల కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశార‌నే ప్ర‌చారం సాగుతోంది. 


‘జ‌గ‌న్’ ప్ర‌భుత్వం కేసుల‌తో, ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తో, ఇత‌ర పాల‌నాప‌ర స‌మ‌స్య‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంద‌ని, ఈ నేప‌ధ్యంలో ఆయ‌న‌ను కాపాడుకునేందుకే ‘విజ‌య‌మ్మ’ ఈ స‌మావేశం ఏర్పాటుచేశారంటున్నారు. త‌న సంతానం తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉన్న స‌మయంలో ఆమె త‌నంత‌ట తానే ఈ స‌మావేశాన్ని ఏర్పాటుచేశారా..?  లేక దీని వెనుక ఎవ‌రైనా ఉన్నారా..? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాగా ..ఈ స‌మావేశానికి క‌ర్త‌, క‌ర్మ‌, అన్నీ  వైఎస్ ఆత్మ‌గా చెప్పుకునే ‘కెవిపి రామ‌చంద్ర‌రావే’న‌ని, ఆయ‌నే దీన్ని ఏర్పాటు చేశార‌ని కొన్ని వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రాలో ‘జ‌గ‌న్’ ప్ర‌భుత్వం తీవ్ర‌మైన ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొంటుంద‌ని, దాన్ని ఎలా ప‌రిష్క‌రించాల‌నే ఆలోచ‌న‌తోనే ‘విజ‌య‌మ్మ‌’, ‘కెవిపి’, ‘ఉండ‌వ‌ల్లి’ వంటి వారు దీన్ని ఏర్పాటు చేశారంటున్నారు. అయితే ‘జ‌గ‌న్’ పార్టీ పెట్టిన ద‌గ్గ‌ర నుంచి ‘కెవిపి’ని ఆయ‌నను ద‌రి చేర‌నీయ‌డం లేదు. ఆయ‌న‌ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ‘కెవిపి’ని ప‌ట్టించుకోలేదు. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల త‌రువాత ‘కెవిపి’ ఇచ్చే స‌ల‌హాలు సూచ‌న‌లు ఆయ‌న పాటిస్తారా...? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. కాగా త‌మ‌ను ద‌రిచేర‌నీయ‌క‌పోయినా ‘కెవిపి’, ‘ఉండ‌వల్లి’ నిరంత‌రం ‘వై.ఎస్ సంతానం’ శ్రేయ‌స్సు కోరుకుంటార‌ని, వారు అధికారంలో ఉండ‌డానికి కావ‌ల్సిన స‌ల‌హాలు, స‌హ‌కారం ఇస్తార‌ని అందుకే వారంద‌రినీ ఒక‌చోట చేర్చితే ఉప‌యోగం ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో ‘విజ‌య‌మ్మ’ ఈ మీటింగ్ ఏర్పాటుచేశారంటున్నారు. మొత్తం మీద ‘విజ‌య‌మ్మ’ నిర్వ‌హించ‌బోయే మీటింగ్ కోసం రాజ‌కీయ వ‌ర్గాలు ఆస‌క్తితో చూస్తున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ