లేటెస్ట్

వైకాపాకు ‘విజ‌య‌మ్మ’ రాజీనామా...!

వైకాపా అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న ‘వై.ఎస్.విజ‌య‌మ్మ’ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రేపు స్వ‌ర్గీయ ముఖ్య‌మంత్రి వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి 12వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆమె హైద‌రాబాద్ లో ఒక స‌భను నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌కు ముందే ఆమె పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేస్తారంటున్నారు. రేపు వైఎస్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ‘ఇడుపుల‌పాయ‌’లోని ఆయ‌న ఘాట్ ను సంద‌ర్శించిన త‌రువాత ఆమె త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె రాజీనామా నిర్ణ‌యం నిజ‌మేన‌ని, పులివెందుల‌లోని ఆమె కుటుంబ‌సభ్యుల‌కు స‌న్నిహితులైన‌వారు ధృవీక‌రిస్తున్నారు. ఆమె ఎందుకు హ‌ఠాత్తుగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నేదానిపై ర‌క‌ర‌కాలైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వీటిలో మొద‌టిది తెలంగాణ‌లో త‌న కుమార్తె స్ధాపించిన వైఎస్సార్టీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానిక‌ని చెబుతున్నారు. 


తెలంగాణ‌లో రాజ‌న్న‌రాజ్యం తెస్తానంటూ వైఎస్ కుమార్తె వైఎస్సార్టీపీని స్థాపించారు. అయితే ఆమె పార్టీ పెట్టినా అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి ఆ పార్టీకి పెద్ద‌గా మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. దీంతో కుమార్తె పార్టీని గ‌ట్టిప‌రిచేందుకు స్వ‌యంగా విజ‌య‌మ్మ రంగంలోకి దిగార‌ని అంటున్నారు. అయితే ఎపిలో జ‌గ‌న్ పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉంటూ తెలంగాణ‌లో ‘ష‌ర్మిల‌’కు మ‌ద్దుతు ఇస్తుండ‌డంతో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో కృష్టా న‌దీజ‌లాల విష‌యంలో జ‌రిగిన ర‌గ‌డ సంద‌ర్భంగా ఇటు ‘జ‌గ‌న్’, అటు ‘ష‌ర్మిల’ ఇద్ద‌రూ ఇబ్బందులు ప‌డ్డారు. ఆంధ్రా పార్టీకి అధ్య‌క్ష‌రాలిగా ఉంటూ తెలంగాణ కోసం కొట్లాడే ‘ష‌ర్మిల‌’కు ఎలా మ‌ద్ద‌తుగా ఆమె  మాట్లాడ‌తారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు కురిపించాయి. రాయ‌ల‌సీమ కొర‌కు నిర్మించే పోతిరెడ్డిపాడును ‘ష‌ర్మిల’ విమ‌ర్శించ‌డంతో రాయ‌ల‌సీమ‌వాసులు ఒకే కుటుంబంలో ఇదేమి రాజ‌కీయ‌మంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రాలో విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా, తెలంగాణ‌లో ఎంతచేసినా ‘ష‌ర్మిల‌’ను అనుమానంగానే ప్ర‌జ‌లు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పార్టీతో సంబంధాలు తెంచుకుని ఇక పూర్తిగా ‘ష‌ర్మిల’ పార్టీ కోసం ప‌నిచేయాల‌నే ఉద్దేశ్యంతో ఆమె వైకాపా గౌరవ అధ్య‌క్ష ప‌దవికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. రేపు నిర్వ‌హించే వైఎస్ వ‌ర్థంతి స‌భ‌లో ఆమె ‘ష‌ర్మిల’ పార్టీకి మేలు చేసే నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. మొత్తం మీద వైకాపా గౌరవ అధ్య‌క్షురాలి రాజీనామా ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ