లేటెస్ట్

రెండేళ్ల‌లో న‌లుగురు సిఎస్ లు...!

వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు గ‌డిచిపోయాయి. ఈ రెండేళ్ల‌లో ఆయ‌న వ‌ద్ద న‌లుగురు సిఎస్ లు ప‌నిచేశారు. ఒక రకంగా ఇది రికార్డే. ఒక ప్ర‌భుత్వ ఐదేళ్ల కాలంలో మ‌హా అయితే ఇద్ద‌రో ముగ్గురో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లు ప‌నిచేస్తారు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌లో న‌లుగురు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులను నియ‌మించుకోవడం అరుదైన ఘ‌ట‌నే. రెండేళ్ల‌కే న‌లుగురు సిఎస్ లు మారిపోతే,  రాబోయే రెండున్న‌రేళ్ల‌లో మ‌రో న‌లుగురు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా నియామ‌కం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో ముఖ్య‌మంత్రి త‌రువాత సిఎస్ దే ముఖ్య‌పాత్ర‌. పాల‌నా వ్య‌వ‌హారాలన్నీ ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి పేరుమీదే న‌డుస్తుంటాయి. విధాన నిర్ణ‌యాలు ప్ర‌భుత్వ పెద్ద‌లు తీసుకుంటే వాటిని అమ‌లు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిది. గ‌తంలో ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శికి విశేష‌మైన అధికారాలు ఉండేవి. ఏ విష‌య‌మైనా ముఖ్య‌మంత్రులు వారి అభిప్రాయం తీసుకుని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకునేవారు. అయితే ప్ర‌స్తుతం అటువంటి సాంప్ర‌దాయాలు క‌నిపించ‌డంలేదు. ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా గుడ్డిగా అమ‌లు చేయ‌డం నేటి సిఎస్ లు అనుస‌రిస్తున్న వైఖ‌రి. ప్ర‌భుత్వ పెద్ద‌లు తాము తీసుకున్న నిర్ణ‌యాల‌ను య‌ధాతథంగా అమ‌లు చేసేవారికే సిఎస్ పోస్టును క‌ట్ట‌బెడుతున్నారు. త‌మ మాట వినేవారికి రెండు మూడు నెల‌లు స‌ర్వీసు ఉన్నా వారిని సిఎస్ గా నియ‌మిస్తున్నారు. 


‘జ‌గ‌న్’ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏ కార‌ణాల‌వ‌ల‌నైతేనేమి ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు సిఎస్ లుగా నియ‌మితుల‌య్యారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌య‌మంలో సిఎస్ గా ఉన్న ‘ఎల్ వి’ త‌రువాత ‘జ‌గ‌న్’ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లో అక్క‌డి నుంచి బ‌దిలీ అయ్యారు. అప్ప‌ట్లో ‘జ‌గ‌న్’ పార్టీకి గ‌ట్టిగా మ‌ద్ద‌తు ఇచ్చిన ‘ఎల్వి’ త‌రువాత ఏ కార‌ణాల‌తోనో ప్ర‌భుత్వ‌పెద్ద‌ల‌కు అయిఇష్టులుగా మారిపోయారు. దాంతో ఆయ‌న సిఎస్ పోస్టు ఊడిపోయింది. త‌రువాత కేంద్ర స‌ర్వీసులో ఉన్న ‘నీలం స‌హానీ’ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఆమెకు కొద్ది నెల‌లు స‌ర్వీసు మాత్ర‌మే ఉన్నా ఆమెను సిఎస్ గా నియ‌మించారు. త‌రువాత ఆమె ప‌ద‌వీకాలాన్ని ఆరు నెల‌లు పొడిగించారు. ఒక‌ప్ప‌డు ఐఏఎస్ ల స‌ర్వీసుల పద‌వీకాలాన్నిపొడిగించాలంటే ప్ర‌ధాని మోడీ అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేశారు. పొడిగింపుల బిజినెస్ వ‌ద్ద‌ని ఆయ‌న డీఒపీటీ అధికారుల‌కు గ‌ట్టిగా చెప్పారు. దీంతో అప్ప‌ట్లో ఆంధ్రా నుంచి, తెలంగాణ నుంచి సిఎస్ లుగా ఉన్న అధికారుల స‌ర్వీసును పొడిగించాల‌ని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కోరినా ఆయ‌న అంగీక‌రించ‌లేదు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ ‘నీలం స‌హానీ’ ప‌ద‌వీకాలం పొడిగించాల‌ని కోరిన వెంట‌నే ఆయ‌న అంగీక‌రించారు. త‌రువాత ప్ర‌స్తుతం సిఎస్ గా ఉన్న ‘ఆదిత్య‌నాధ్ దాస్’ ప‌ద‌వీకాలాన్ని కూడా పొడిగించారు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌ర్వీసు ఈ నెల 30వ తేదీతో ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌రో రెండు నెల‌లు స‌ర్వీసు ఉన్న ‘స‌మీర్ శ‌ర్మ’ను సిఎస్ గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. కేవ‌లం రెండు నెల‌లు స‌ర్వీసు ఉన్న అధికారుల‌ను సిఎస్ గా నియ‌మించుకోవడం త‌రువాత వారి ప‌ద‌వీకాలాన్ని పొడిగించుకోవ‌డం ప్ర‌స్తుతం ఆచారంగా సాగుతోంది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు ఐఎఎస్ అధికారులు ప్రైవేట్ సంభాష‌ణ‌ల్లో అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద సిఎస్ ల నియామ‌కం విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి తీవ్ర వివాదానికి కార‌ణం అవుతోంది. ఈ వ్య‌వ‌హారంలో కేంద్రం తీరుపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పారద‌ర్శ‌క‌మైన ప్ర‌భుత్వం అని చెప్పుకునే బిజెపి కేంద్ర స‌ర్వీసు అధికారుల విష‌యంలో ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించ‌డంతో వారి పార‌ద‌ర్శ‌క‌త నేతిబీర చంద‌మే అనే మాట స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ