శభాష్ మోత్కుపల్లి...!
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబు అక్రమ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. తెలుగు రాష్ర్టాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాలు, ఇతర దేశాలల్లో నివసిస్తోన్న తెలుగువారు ఆయన అక్రమ అరెస్టుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి తప్పు చేయని చంద్రబాబును, ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదని, ఆయన అవినీతికి పాల్పడి ఉంటే, దానికి సరైన ఆధారాలు చూపి అరెస్టు చేయాలని, 75 ఏళ్ల చంద్రబాబు వయస్సు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం వారిలో హాగ్రావేశాలకు గురిచేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఇప్పటికీ చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లోనూ, ఇతర దక్షిణ భారత దేశ రాష్ర్టాల్లోనూ ఇదే విధమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలని, ఆయనకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా చంద్రబాబు అరెస్టుపై ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, జనసేన, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి. అయితే చంద్రబాబుకు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఆయనను అరెస్టు చేసినప్పుడు ముందుగా ఎవరి పిలుపు లేకుండా, స్వచ్ఛంధంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో రోడ్ల మీదకు వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ తరువాత కాలనీలకు, కాలనీలు కదలివచ్చి ఆయనకు సంఘీభావం తెలిపాయి. ముఖ్యంగా మహిళలు ఎవరూ నాయకత్వం వహించకపోయినా తామంత తామే రోడ్లపైకి వచ్చి నిరసన తెలియచేశారు. ఆ తరువాత తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కదలిక వచ్చింది. చంద్రబాబు అభిమానులు, టిడిపి తెలంగాణ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఉద్యమాలు నిర్వహించారు. దీంతో అధికార బిఆర్ ఎస్‌లో కదలిక వచ్చింది. చంద్రబాబు అరెస్టును ఖండించకపోతే ఎక్కడ సీమాంధ్ర ఓట్లు పోతాయో అన్న భయంతో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆయన అరెస్టును ఖండిస్తూ వస్తున్నారు. వాళ్ల ఉద్ధేశ్యం ఎలా ఉన్నా ముందుగా చంద్రబాబు అరెస్టును ఎగతాళి చేసిన కెటిఆర్ వంటి నేతలు తరువాత నోరెత్తడం లేదు.
ఇది ఇలా ఉంటే ఈ రోజు చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహ్ములు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎటువంటి మొహమాటం లేకుండా జగన్ క్రిమినల్ అని, ఆయన వల్ల ఎపి నాశనమైపోయిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు జగన్‌కు గుణపాఠం నేర్పుతారని విమర్శించారు. జైలులో చంద్రబాబుకు ఏమైనా జరిగితే జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్‌ను నమ్మి దళితులు వైకాపాకు ఓట్లు వేశారని, ఇప్పుడు జగన్ వారినే హత్యలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో మాస్క్‌లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను హత్య చేయించారని, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను హత్య చేసి ఇంటికి పార్శిల్ చేశారని, అదే విధంగా అక్రమ ఇసుకను తరిలిస్తున్నందకు ప్రశ్నించిన దళిత యువకునికి శిరోముండనం చేశారని, ఇటువంటి ఘోరాలు గతంలో ఎప్పుడు జరగలేదని జగన్ పాలనలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. మాట్లాడితే మీ బిడ్డ..మీ బిడ్డ అంటాడని, ఆయన స్వంత తల్లిని, చెల్లిని తరిమేశాడని, ఇటువంటి వారి వల్ల ప్రజలకు న్యాయం జరగదని, స్వంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకు ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించాలని, రాజకీయాలను పక్కనపెట్టి కెసిఆర్ స్పందించాలని ఆయన కోరారు. తాను భారాసాలో ఉన్నా వ్యక్తిగతంగా చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నానని, చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్‌లో నిరసన దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. కాగా ఇప్పటి దాకా తెలంగాణ నాయకులు చంద్రబాబు అరెస్టుపై స్పందించినా మోత్కుపల్లివలే ఘాటుగా స్పందించలేదని, ఆయన స్పందన తరువాత ఇప్పుడు తెలంగాణలో మరికొందరు నేతలు జగన్‌పై తీవ్రస్థాయిలో వత్తిడి తెస్తారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో తమకు చంద్రబాబు అరెస్టు విషయం దెబ్బతీస్తుందన్న ఆలోచనతో భారాసా నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు మోత్కుపల్లి బహిరంగంగా వైకాపా అధినేతపై ధ్వజమెత్తడంతో మరికొందరు అదే బాటలో పయనిస్తారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మోత్కుపల్లి టిడిపిలోనే ఉండేవారు. నల్లగొండ జిల్లా నుంచి ఎస్సీ నాయకునిగా ఎదిగారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. టిడిపిలో సుధీర్ఘకాలం పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తరువాత భారాసాలో చేరారు. 1983 నుంచి 1999 దాకా వరుసగా ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 2009లో టిడిపి తరుపున మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నర్సింహ్ములు చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించిన తీరుకు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పార్టీ ఏదైనా, అక్రమ అరెస్టు విషయంలో ఆయన స్పందనపై తెలంగాణ టిడిపి నేతలు శభాష్ మోత్కుపల్లి అని ప్రశంసిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అక్రమ అరెస్టులు, దిగ్భంధనాలు, నిరంకుశత్వంపై ఆయన వ్యవరిస్తున్న తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.