TTD ఛైర్మన్ ‘కాపు’లకా.. ‘రాజు’లకా...?
‘కమ్మ’లకు నో ఛాన్స్...!
ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాలను పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారు. మొదటి నుంచి ఆయన కులాల లెక్కవేసుకునే ఈ పదవులను పంచుతారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా..ఆయన ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మాత్రం తన కులానికి చెందిన వారినే టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. ఆయన ఐదేళ్ల పదవీకాలంలో ముందుగా తన బాబాయి సుబ్బారెడ్డికి, తరువాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. నా బీసీలు, నా ఎస్సీలు అని పదే పదే చెప్పే జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా వేరే కులానికి చెందిన ఎవరినీ పరిగణలోకి తీసుకోలేదు. గతంలో ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే విధంగా వ్యవహరించారు. అయితే వీరికి భిన్నంగా టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తన సామాజికవర్గానికి ఈ పదవిని అప్పగించలేదు.
రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి అయిన ఆయన ఐదేళ్ల కాలంలో టీటీడీ ఛైర్మన్ పదవిని మొదట ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వగా, తరువాత ‘యాదవ్’ సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చారు.అప్పట్లో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు టీటీడీ ఛైర్మన్ పదవి తమకు ఇవ్వాలని విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పట్లో ఎంపీలుగా ఉన్న రాయపాటి సాంబశివరావు, సినీనటుడు మురళీమోహన్ తమకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని పదే పదే వేడుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం స్వంత సామాజికవర్గానికి ఇచ్చేది లేదని తేల్చి చెప్పి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళుతున్నారు. చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ పదవిని స్వంత సామాజికవర్గానికి కాకుండా ‘కాపు’లకు కానీ, ‘రాజు’లకు కానీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కాపు’లకు ఇవ్వాలనుకుంటే ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వవచ్చు. అలా కాకుండా ‘రాజు’లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే మాజీ కేంద్రమంత్రి, సీనియర్ టిడిపి నాయకుడు అశోక్‌గజపతిరాజుకు ఇవ్వవచ్చని ప్రచారం సాగుతోంది. మంత్రివర్గంలో రాజులకు ప్రాతినిధ్యంలేకపోవడంతో ఈ పదవి ఖచ్చితంగా రాజులకే దక్కుతుందని టిడిపిలో ప్రచారం సాగుతోంది. టిడిపీలో సీనియర్ అయిన అశోక్‌గజపతిరాజుకు ఆ పదవి ఇస్తే ఆ పదవికే వన్నె తెస్తారని, ఆ పదవికి ఆయనే అర్హుడనే అభిప్రాయం టిడిపిలో ఉంది. అయితే..పవన్ కనుక తన సోదరునికి ఇవ్వాలని ఒత్తిడి తెస్తే..ఆయన చెప్పిన వారికే పదవి దక్కుతుంది. మొత్తం మీద..గత ఎన్నికల్లో టిడిపి గెలుపుకోసం ప్రాణాలొడ్డి పోరాడిన ‘కమ్మ’వారికి నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.