ఇవేం నియామకాలు...!?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చేనిక కొన్ని బదిలీలు, పోస్టింగ్‌లు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం, ఇంకా వివిధశాఖల్లో తిష్టవేసిన వైకాపా భజన బృందాన్ని అక్కడ నుంచి పంపించకపోవడం టిడిపి వర్గాల్లో ఆవేదన, ఆగ్రహానికి కారణమవుతోంది. ముఖ్యంగా జగన్ భజన చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వివేది విషయంలో చేసిన పొరపాటు టిడిపి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఆ తరువాత ఆ తప్పుదిద్దుకున్నా, వెంటనే మరో పొరపాటు చేయడం టిడిపి నేతలకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు నచ్చడం లేదు. టీటీడీ ఇఒగా శ్యామలరావును నియమించడం కూడా వివాదాస్పదమైంది. ఆయన జగన్‌కు కావాల్సిన వ్యక్తి అని, జగన్ అధికారంలో ఉండగా అన్నీతానై వ్యవహరించారని, అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఇఓ పదవి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న టిడిపి వర్గాల్లో వ్యక్తం అయింది. అదే విధంగా కొందరు ఐపిఎస్ అధికారుల విషయంలో కూడా పొరపాట్లకు తావిచ్చారు. తాజాగా బదిలీ చేసిన వారి విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా ప్రద్యుమ్మను నియమించడం కూడా విమర్శలకు కారణమైంది. గతంలో ఆయన చంద్రబాబు కార్యాలయంలో పనిచేశారు. అప్పట్లో..ఆయన పనితీరుపై అభ్యంతరాలు రావడంతో అక్కడ నుంచి పంపించివేశారు. అయితే..ఇప్పుడేమి జరిగిందో కానీ, మళ్లీ ఆయనను సిఎంఓలోకి తీసుకున్నారు. ప్రద్యుమ్న భార్య వైకాపా లీగల్ సెల్‌లో పనిచేస్తుందని, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఆమె అత్యంత సన్నిహితురాలని సోషల్ మీడియాలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఒక ఫోటోను ఒకటే ట్రోల్ చేశారు. అయినా ఈ విషయంలో టిడిపి పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ‘లక్ష్మీపార్థసారధి’కి కొలువా...?
తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి లక్ష్మీపార్థసారధి భాస్కర్‌ను అమరావతి డెవలప్‌మెంట్ ఆథారిటీ ఛైర్మన్‌గా నియమించడంపై అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఎవరూ లేనట్లు రిటైర్డ్ అయిన ఆమెను మళ్లీ నియమించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆమె ఈ పదవిలో ఉన్నప్పుడు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల క్రితందాకా ఈ పదవిలో ఉన్న ఆమె జగన్ గెలిచిన తరువాత ఎప్పుడూ ఇక్కడ కనిపించలేదు. ఆమె పార్టీకి కానీ, రాజధాని విషయంలో కానీ చేసిందేమిటని, ఆమెను ప్రత్యేకంగా మళ్లీ పిలిచి పదవి ఇవ్వడం ఎందుకనే ప్రశ్న టిడిపి వర్గాల నుంచి వస్తోంది. చంద్రబాబులో మార్పురాలేదని, ఆయనలో మార్పు వచ్చిందని భావించామని, ఆయన మాత్రం మారలేదని, ప్రత్యర్ధుల పట్ల సానుకూలంగా ఉంటున్నారని, తనకు అపకారం చేసిన వారి విషయంలోనూ అదే విధంగా ఉంటున్నారని, అసమర్ధులు, అవినీతి మరకలు అంటిన వారికి పోస్టింగ్‌లు ఇస్తున్నారనే చర్చ టిడిపి వర్గాల్లో జోరుగా సాగుతోంది.