‘జవహర్‌రెడ్డి’లో పశ్చాత్తాపం...!?
మాజీ ప్రభుత్వప్రధానకార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడంపై రాజకీయ, అధికారవర్గాల్లోచర్చ జరుగుతోంది. మాములుగా అయితే..ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్ అవుతుంటే..ఆయనను ప్రభుత్వం గౌవరవంగా సాగనంపుతుంది. కానీ..కీలకమైన పదవిలో ఉండగా వివాదాస్పదంగా ఇంకా చెప్పాలంటే కిరాతకంగా వ్యవహరించిన అధికారి రిటైర్ అవుతుంటే..ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. దరిద్రం వదిలిందిలే..అని సంతోషపడుతుంది. అయితే మానవసంబంధాలకు, గౌరవాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ అధికారి ఎంతటి కిరాతకుడు అయినా..ఎటువంటి భజనపరుడు అయినా..ఆయనకు సముచితగౌవరవం ఇచ్చి సాగనంపుతోంది. ఇటువంటి సముచిత గౌరవం జవహర్‌రెడ్డికి చంద్రబాబు కల్పించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్‌రెడ్డి ఆయనకు ఊడిగం చేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్న ఆయన వైకాపా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. వైకాపా గెలుపుబాధ్యతను తన భుజాలపై పెట్టుకుని, పార్టీ తనదేనన్నంత విధిగా ఆయన వైకాపా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించారు. ఈ క్రమంలో వందలాది మంది వృద్ధుల ప్రాణాలను తీశారు. అయినా..ఆయనలో ఇసుమంతైనా పశ్చాత్తాపం కనిపించలేదు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులను నడిఎండలో నిలబెట్టి హింసించి వారు చావుకు కారణమయ్యారు. ఇదంతా కేవలం తన కులంవాడు అధికారంలో ఉండాలన్న దుగ్ధ తప్ప మరోటేమీ లేదు.
వాస్తవానికి చంద్రబాబుకు జవహర్‌రెడ్డికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయే వరకూ జవహర్‌రెడ్డి పంచాయితీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఐదేళ్లపాటు అక్కడి నుంచి జవహర్‌రెడ్డిని చంద్రబాబు కదిలించలేదు. జవహర్‌రెడ్డి బాగా పనిచేస్తారని, రాష్ట్రంలో సీసీరోడ్ల నిర్మాణంలో ఆయన చొరవతీసుకున్నారని, చెప్పిన పని చెప్పినట్లు చేస్తారనే ఉద్దేశ్యంతో జవహర్‌రెడ్డిపై చంద్రబాబు విశేష ప్రేమచూపారు. అయితే..చంద్రబాబు మంచితనాన్ని అలుసుగా తీసుకుని జవహర్‌రెడ్డి అప్పట్లో భారీగానే వెనకేసుకున్నారు. అప్పట్లో జవహర్‌రెడ్డి అవినీతిపై Janamonline.com ప్రత్యేక కథనాలను ప్రచురించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగినా..చంద్రబాబు జవహర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో చర్యలు తీసుకోలేదు. అయితే..తనను ఎంత సమర్ధించినా..ఎంత వెనకేసుకువచ్చినా..తమ కులం వాడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే భావనతో చంద్రబాబు ఓటమికి చేయాల్సిందంతా జవహర్‌రెడ్డి చేశాడు. అయితే..ఆయన ఎంత చేసినా..రాష్ట్ర ప్రజలు అసమర్ధుడు, అవినీతిపరుడైన జగన్‌ను ఇంటికి పంపారు. జగన్ ఓడిపోవడంతోనే జవహర్‌రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. అయితే జవహర్‌రెడ్డి రేపు రిటైర్ కానుండడంతో పోస్టింగ్ లేకుండా రిటైర్ కావడం ఐఏఎస్ అధికారికి అవమానం. మానవత్వం పాళ్లు అధికంగా ఉన్న చంద్రబాబు జవహర్‌రెడ్డికి అవమానం జరగకుండా పోస్టింగ్ ఇచ్చి గౌవరంగా సాగనంపే అవకాశం ఇచ్చారు. తనకు చంద్రబాబు కల్పించిన గౌరవంపై జవహర్‌రెడ్డి కన్నీరుపెట్టుకున్నారని, తాను చంద్రబాబుకు ఎంత అన్యాయం చేసినా, ఆయన మాత్రం తనపై ఎటువంటి ధ్వేషం పెట్టుకోకుండా పెద్దమనిషిగా వ్యవహరించారని, తాను చాలా తప్పుచేశానని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. మొత్తం మీద...జవహర్‌రెడ్డికి పదవీ విరమణరోజు జ్ఙానోదయం అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.