లేటెస్ట్

వేగంగా నిర్ణ‌యాలు తీసుకోండి... ‘బాబు’గారూ...!

చారిత్రాత్మ‌క విజ‌యం సాధించిన త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడిలో ఎక్క‌డ‌లేని ఆత్మ‌విశ్వాసం క‌నిపిస్తోంది. గ‌త ఐదేళ్ల నుంచి అనుభ‌వించిన న‌ర‌క‌యాత‌న నుంచి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని, శ‌త్రువు కోలుకోలేనివిధంగా దెబ్బ‌తిన్నార‌ని, త‌న ఆవేద‌న‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని, తాను చెప్పిందే నిజం అయింద‌నే భావ‌న ఆయ‌న‌లో అంతు లేని ఆత్మ‌విశ్వాసానికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్‌డిఏ ప్ర‌భుత్వం త‌న మీద ఆధార‌ప‌డ‌డం, కేంద్రంలో మ‌ళ్లీ చ‌క్రం తిప్పే ప‌రిస్థితులు రావ‌డం, 20ఏళ్ల క్రితం నాటి ప‌రిస్థితులు పున‌రావృతం కావ‌డం ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని సంతోషాన్ని క‌ల్గిస్తున్నాయి. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మంత్రివ‌ర్గ ఏర్పాటులో ఆయ‌న చూపించిన వైవిధ్యం ఆయ‌న‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని బ‌హిర్గ‌త‌ప‌రిచే అంశంగా చెప్ప‌వ‌చ్చు. టిడిపి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే ఎప్పుడూ మంత్రులుగా ఉండే మొహాలు ఈసారి క‌నిపించ‌క‌పోవ‌డం, యువ‌త‌, కొత్త‌వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం దీనికి ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఎక్క‌డా తొంద‌ర‌, త్రోటుపాటు లేకుండా ఆయ‌న పాల‌న‌ను నెమ్మ‌దిగా సాగిస్తున్నారు. కీల‌క అధికారుల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో కానీ, బ‌దిలీలు చేయ‌డంలో కాని ఆయ‌న త‌న మార్కును చూపిస్తున్నారు. అయితే..అధికారంలోకి రాక‌ముందు..ఎవ‌రైతే తన‌కు, పార్టీకి ఇబ్బందులు క‌ల్గించిన‌వారిపై తీసుకుంటాన‌న్న చ‌ర్య‌ల విష‌యంలో మాత్రం ఆయ‌న ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల విష‌యంలో ఆయ‌న అంత ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం లేదు. గ‌త ప్ర‌భుత్వ ఒత్తిడివ‌ల్ల వారు ఆ విధంగా చేశారులే..అని కొంద‌రి విష‌యంలో ఆయ‌న స‌రిపెట్టుకుంటున్నారు. అయితే ఈ విష‌యంపై పార్టీ నుంచి ఆయ‌న‌పై ఎక్క‌డాలేని ఒత్తిడి వ‌స్తోంది.


ఇది ఇలా ఉంటే..పార్టీ ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్లులు, ఇత‌ర పోస్టుల పంప‌కం పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. వారి ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డంలో చంద్ర‌బాబు వేగంగా ప‌నిచేయ‌డం లేద‌నే ఆరోప‌ణ వారి నుంచి వ‌స్తోంది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే..సొమ్ముల‌తో ప‌నిలేని కొన్ని పోస్టుల‌ను వేగంగా భ‌ర్తీ చేయాల‌న్న‌ది వారి కోరిక‌. ఉదాహ‌ర‌ణ‌కు టీటీడీ ఛైర్మ‌న్ పోస్టును వెంట‌నే భ‌ర్తీ చేయ‌వ‌చ్చు. ఈ పోస్టు భ‌ర్తీకీ సొమ్ముల‌తో ప‌నిలేదు. త‌న‌కు న‌చ్చిన‌వారికి ఈ పోస్టును ముందే ఇచ్చేస్తే ఒక ప‌ని అయిపోతుంది. గ‌తంలో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఈ పోస్టును భ‌ర్తీ చేయ‌డానికి నెల‌ల కొద్ది స‌మ‌యం తీసుకున్నారు. అప్ప‌ట్లో దీనిపై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈసారైనా వేగంగా ఈ ప‌ద‌విని భ‌ర్తీ చేయాలి. అదే విధంగా వివిధ నామినేటెడ్ పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేయాలి. ముందుగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వారికి ప‌ద‌వులు అప్ప‌గించాలి. అదే విధంగా గ‌తంలో పార్టీ సానుభూతిప‌రుల‌ని ముద్ర‌వేయించుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అష్ట‌క‌ష్టాలు పెట్టింది. అటువంటి వారిని గుర్తించి వారికి ప్రాధాన్య‌త పోస్టుల‌ను ఇవ్వాలి. ఇప్ప‌టికీ వివిధ శాఖ‌ల్లో తిష్ట‌వేసిన జ‌గ‌న్ భ‌క్త అధికారుల‌ను ఏరివేయాలి. చంద్ర‌బాబు ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, ఆల‌స్యం..అమృతం విషం అన్న సామెత‌ను ఆయ‌న‌కు ప‌దే ప‌దే గుర్తు చేయాల్సి వ‌స్తుంద‌ని టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. గ‌తంలో అమ‌రావ‌తి విష‌యంలో వేగంగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌లనే దానిపై ప్ర‌తిప‌క్షాలు రాద్ధాంతం చేసే అవ‌కాశం వ‌చ్చింది. గ్రాఫిక్స్ అంటూ గేలిచేయ‌డం వెనుక చంద్ర‌బాబు వేగంగా ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మే కార‌ణం. అప్ప‌ట్లోనే అమ‌రావ‌తిలో ప్ర‌భుత్వ ఉద్యోగులకు, న్యాయ‌మూర్తుల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎంపిల‌కు, జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించారు. ఆ స్థ‌లాల‌ను వేగంగా ఇచ్చివేసి వారంతా అక్క‌డ‌కు వ‌చ్చేవిధంగా చేసిన‌ట్ల‌యితే..త‌రువాత వ‌చ్చిన జ‌గ‌న్‌కు అమ‌రావ‌తిని అక్క‌డ నుంచి క‌దిలించ‌డం అంత సుల‌భ‌మ‌య్యేది కాదు. కానీ..నాడు చంద్ర‌బాబు కొంత మంది ఇచ్చిన స‌ల‌హాల‌తో వేగంగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ దానిపై కుల‌ముద్ర‌వేసి నాశ‌నం చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు. గ‌తంలో అత్యంత వేగంగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతోనే..కొన్ని విష‌మ‌ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. దాన్ని చంద్ర‌బాబు ఇప్పుడైనా గుర్తించాల్సి ఉంది. నిధుల‌తో సంబంధం లేని ప‌నులు, పోస్టింగ్‌లు వెంట‌వెంట‌నే చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ