మంత్రుల పేషీ అధికారులు ఎవరు...!?
రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఏ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పూర్తిగా కొలువుతీరుతోంది. దాదాపు అందరు మంత్రులూ అధికారబాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత కొందరు మంత్రులు తమ చాంభర్‌లను ఆధునీకరించుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వం అమరావతి సచివాలయాన్ని బీడు పెట్టింది. అక్కడ అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నా..కనీసం చిన్నచిన్నమరమ్మత్తులను సైతం చేయలేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సచివాలయాన్ని ఆధునిక వసతులతో నిర్మించారు. అన్ని భవనాలను సెంట్రల్ ఎసీ సౌకర్యాన్ని కల్పించారు. ఆధునిక హంగులతో సచివాలయం మెరిసిపోయేది. అయితే...జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లు దాన్ని వాడుకుని పూర్తిగా పాడుబెట్టేశారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారికి కావాల్సిన విధంగా కొన్ని మరమ్మత్తులు చేయించుకుంటున్నారు. ఒకవైపు కార్యాలయాలను మరమ్మత్తులు చేయించుకుంటున్న మంత్రులు మరోవైపు తన కార్యాలయ పేషీ అధికారుల నియామకంపై కసరత్తులు చేస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల పేషీలో పనిచేసిన అధికారులను ప్రస్తుత మంత్రులు తమ వద్ద నియమించుకోవద్దని అనధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల పేషీలో వివిధ హోదాల్లో పదవులు నిర్వహించిన వారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, అప్పటి మంత్రులకు అవినీతి సొమ్ము భారీగా దోచిపెట్టారని, దోచిపెట్టడంతో పాటు వారూ వాటాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత వారిని మంత్రుల కార్యాలయంలో నియమించుకోవద్దని సిఎం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మంత్రులు మాత్రం వారే కావాలని ముఖ్యమంత్రి వద్ద పట్టుబడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలోమంత్రులుగా వ్యవహరించిన వారే ఈ విధంగా చేస్తున్నారని, కొందరు తెలంగాణలో పనిచేసే అధికారులు కావాలని కోరితే ముఖ్యమంత్రి తిరస్కరించారని చెబుతున్నారు. కాగా మరికొందరుమాత్రం జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కావాలని పట్టుబడుతున్నారు. అయితే వీరి కోర్కెలను సిఎం తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాబోయే వారం రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.