జగన్ అరాచకానికి బలైన ఐఏఎస్ శ్రీధర్...!
ఫ్యాక్షనిస్టులు పాలకులు అయితే...ప్రజలు ఎంతటి విపత్కర స్థితులను ఎదుర్కొంటారో అనేదానికి గత ఐదేళ్ల జగన్ పాలనే ప్రత్యక్ష ఉదాహరణ. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఘోరాలు, నేరాలు, అవినీతి, అరాచకం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ అరాచకానికి సామాన్య ప్రజలే కాదు..అత్యున్నత ఐఏఎస్ అధికారులు కూడా బలయ్యారు. ఫ్యాక్షన్ పాలకుల మతిలేని, అరాచక చేష్టలకు అమరావతి రైతులతో పాటు, అమరావతి నిర్మాణానికి రైతులను ఒప్పించి భూసేకరణ చేసిన అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఘోరంగా బలయ్యారు. ఆయన చేసిన నేరమల్లా అప్పుడు రాజధాని కోసం రైతులను ఒప్పించి భూములు ఇప్పించడమే. దాదాపు 32 వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించడంలో శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. రైతు కుటుంబానికి చెందిన శ్రీదర్ రాజధాని కోసం రాజధాని గ్రామాల్లో పర్యటించి, రైతులకు రాజధాని ఆవశ్యకత, రాజధాని వస్తే వారికి కలిగే లాభాలు వివరించి, ఎటువంటి ఆందోళనలు, గందరగోళాలు లేకుండా రైతుల నుంచి భూములను రాజధాని కోసం ఇప్పించగలిగారు. అప్పట్లో ఆయన పనితీరు నచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనను సిఆర్‌డిఏ కమీషనర్‌గా నియమించారు. సీఆర్‌డిఏ కమీషనర్‌గా ఆయన అద్భుతంగా పనిచేశారు. రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తోన్న కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి పలుసార్లు ప్రశంసలు దక్కాయి. అయితే...2019లో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయి, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రీధర్‌కు కష్టాలు మొదలయ్యాయి.
చంద్రబాబుపై, అమరావతిపై కక్షతో రగిలిపోయిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీధర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై కిరాతకంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదట శ్రీధర్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. తరువాత రాజధానిలో అవినీతి, అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఇన్నర్‌రింగ్‌రోడ్డులో అవినీతి జరిగిందని, ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పురపాలకమంత్రి నారాయణ ప్రమేయం ఉందని చెప్పాలని శ్రీదర్‌ను బెదిరించారు. అవేమీ సాదా సీదా బెదిరింపులు కాదు..ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్స్ ప్రవర్తనకన్నా ఘోరంగా వ్యవహరించారని తెలుస్తోంది. శ్రీధర్‌ను ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో బెదిరించారని, చంద్రబాబును ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని, ఇంకా వేయని రింగ్‌రోడ్డులో ఆయన పాత్ర ఉందని శ్రీధర్‌తో చెప్పించడానికి పాలకులు అత్యంత కిరాతకంగా, మానవత్వం లేకుండా వ్యవహరించారు. అయితే..ఎన్ని బెదిరింపులు వచ్చినా తట్టుకున్న శ్రీధర్‌ను కాదని, ఆయన హయాంలో సిఆర్‌డిఏలో పనిచేసిన అధికారులతో బలవంతంగా సంతకాలు తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీధర్ తప్పేమీలేకపోయినా ఆయనకు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు.
శ్రీధర్ వల్లే చంద్రబాబుపై కేసు నమోదయిందన్న భావన టిడిపి వర్గాల్లో, కార్యకర్తల్లో ఉంది. అయితే..అందులో తన ప్రమేయం లేదని, ఫ్యాక్షన్ పాలకులు ఎంత బలవంతం చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా తాను తట్టుకుని నిలబడ్డానని శ్రీధర్ తన సన్నిహితులతో అంటున్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పుకు తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదని, తనపై అప్పట్లో వారు...ఆ విధంగా కక్ష సాధించారని, ఇప్పుడు వీరు కక్షసాధిస్తున్నారని ఆయన వారితో చెబుతున్నారట. వాస్తవానికి శ్రీధర్ కు పనిమంతునిగా, నిజాయితీపరునిగా పేరుంది. చెప్పిన పని చెప్పినట్లు చేస్తారని, ఎంత కష్టసాధ్యమైన పనైనా..ఆయన వల్లే పూర్తి అవుతుందని అధికారవర్గాలు చెబుతుంటాయి. ఫ్యాక్షన్ పాలకులు ఆడిన నాటకంలో శ్రీధర్ పావుగా మారారని,ఆయన తప్పేమీ లేకపోయినా ఆయన బలయ్యారని రాజకీయవర్గాలతోపాటు, అధికారవర్గాలు అంటున్నాయి. గత ఐదేళ్లలో ఇక్కడ విధ్వంసం జరిగిందని చంద్రబాబు మాటిమాటికి చెబుతున్నారు. ఆ విధ్యంసంలో శ్రీధర్ లాంటి ఐఏఎస్ అధికారి కూడా బలయ్యారు. ఒకవేళ శ్రీధర్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందకపోతే..ఆయన బలయ్యేవారు కాదనే భావన పలువురిలో ఉంది. చంద్రబాబు సామాజికవర్గం కాని ఐఏఎస్ అధికారులను జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. శ్రీధర్‌కు ముందు సిఆర్‌డిఏ కమీషనర్‌గా పనిచేసిన అధికారి ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. ఎందుకంటే..ఆయన చంద్రబాబు సామాజికవర్గం కాకపోవడమే. మొత్తం మీద..ఫ్యాక్షన్ పాలకుల వికృత క్రీడకు ఐఏఎస్ శ్రీధర్ బలయ్యారు.