లేటెస్ట్

మాజీ ఐఏఎస్‌ రీ ఎంట్రీతో టిడిపిలో గందరగోళం...!

మాజీ ఐఏఎస్‌ అధికారి ‘రామాంజనేయులు’ ‘చంద్రబాబు’ ప్రభుత్వంలో పలు కీలకశాఖలకు అధినేతగా వ్యవహరించారు. పంచాయితీరాజ్‌ కమీషనర్‌గా, పౌరసంబంధాలశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ‘చంద్రబాబు’తో ఉన్న సాన్నిహిత్యంతో తన పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించుకోగలిగారు. అంతే కాదు..అప్పుడే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో టిడిపి టిక్కెట్‌ కావాలని అధినేత ‘చంద్రబాబు’ను కోరడం..ఆయన అంగీకరించడంతో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లా ‘కోడుమూరు’ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన మళ్లీ టిడిపి గడప తొక్కలేదు. పైగా ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వెళ్లి తన పోస్ట్‌ తనకు మళ్లీ ఇవ్వాలని కోరారని వార్తలు వచ్చాయి. అయితే...అది ఏమయిందో తెలియదు కానీ..తరువాత ఆయన ఎక్కడా కనిపించలేదు. తాను పోటీ చేసిన ‘కోడుమూరు’లో కానీ, ‘చంద్రబాబు’ వద్దకు కానీ ఆయన రాలేదు. అయితే ఇటీవల కాలంలో మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. తాను పోటీ చేసిన ‘కోడుమూరు’ నియోజకవర్గంలో తాను మళ్లీ పోటీ చేస్తానని చెబుతున్నారట. అంతే కాదు..టిడిపి అధినేత ‘చంద్రబాబు’ ఇటీవల కాలంలో కలుస్తున్నారు. ఆయన దాదాపు రెండున్నరేళ్ల తరువాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ‘రామాంజనేయుల’కు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఆయన ఓటమికి కారణమైన ‘కోడుమూరు’ నేతలు తరువాత నియోజకవర్గంలో అంతా తామై వ్యవహరిస్తున్నారు. 2024లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ‘రామాంజనేయులు’ రీ ఎంట్రీ ఇవ్వడంతో వారు గందరగోళానికి గురౌతున్నారు. ఈయన మళ్లీ వచ్చాడు..‘చంద్రబాబు’ వద్ద ఉన్న పరపతిని ఉపయోగించుకుని మళ్లీ సీటు తన్నుకుపోతారేమోనన్న ఆందోళన వారిలో ఉంది.‘కోడుమూరు’లో ఇప్పటిదాకా పార్టీ వ్యవహారాలన్నింటిని చూస్తోన్న ‘వెంకటస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి’ ‘రామాంజనేయులు’ విషయంపై ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నియోజకవర్గ ప్రజలకు మొహం చూపించని ‘రామాంజనేయులు’ ఇప్పుడు ఎందుకు ఇక్కడకు వస్తున్నారనే విషయంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ