లేటెస్ట్

‘వంగ‌వీటి రాధా’కు అడ్డుప‌డుతోన్న అదృశ్య‌శ‌క్తి ఎవ‌రు...!?

ఘ‌న‌మైన రాజ‌కీయ‌చ‌రిత్ర‌తో పాటు, మాస్ ప్ర‌జ‌ల్లో తిరుగులేని ఆద‌ర‌ణ ఉన్న ‘వంగ‌వీటి రాధాకృష్ణ‌’కు రాజ‌కీయంగా అస‌లు క‌లిసి రావ‌డం లేదు. దివంగ‌త ‘వంగ‌వీటి రంగా’ త‌న‌యుడిగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న త‌న రాజ‌కీయ అరంగ్రేటాన్ని గొప్ప‌గానే ప్రారంభించారు. అతి చిన్న‌వ‌య‌స్సులోనే కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే త‌రువాత రాజ‌కీయంగా ఆయ‌న త‌ప్ప‌ట‌డుగులు వేశారు. కాంగ్రెస్ నుంచి అప్పుడే ఆవిర్భ‌వించిన ప్ర‌జారాజ్యం పార్టీలోచేరి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఆయ‌న‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీసింది. ఆ త‌రువాత ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా..రాజ‌కీయంగా నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు. విఫ‌ల‌మైన ప్ర‌జారాజ్యం త‌రువాత ఆయ‌న వైకాపాలో చేరారు. అయితే..‘జ‌గ‌న్‌’ ఆయ‌నను రాజ‌కీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ‌తీశారు. తొలిసారి పార్టీ టిక్కెట్ ఇచ్చినా ‘రాధా’ ప్ర‌త్య‌ర్ధుల‌ను ప్రోత్స‌హించి ఆయ‌న‌ను గెలుపును అడ్డుకున్నారు. ఆ త‌రువాత పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేశారు. తాను చేయి వ‌దిలేస్తే దిక్కులేనివాడ‌వుతాడంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికి ‘రాధా’ను మాన‌సికంగా హింసించి పార్టీ నుంచి ప‌క్క‌కు నెట్టేశారు. అయితే..‘రాధా’ త‌రువాత టిడిపిలో చేరినా ఆయ‌న‌కు అంత‌గా అవ‌కాశాలు రాలేదు. 2019లో ఏదో ఒక స్థానం నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని భావించినా..ఆయ‌న‌కు అప్పుడు అవ‌కాశం రాలేదు. అయితే..ఆ ఎన్నిక‌ల్లో టిడిపి ఓడిపోవ‌డంతో..‘రాధాకృష్ణ’ రాజ‌కీయంగా మౌనాన్ని ఆశ్ర‌యించారు. అయితే..2024 ఎన్నిక‌ల ముందు ఆయ‌న మ‌ళ్లీ క్రియాశీల‌కం అయ్యారు. టిడిపి నుంచి కానీ జ‌న‌సేన నుంచి కానీ పోటీ చేయాల‌ని భావించారు. త‌న‌కు ప‌ట్టున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యారు. అయితే..అక్క‌డ ఉన్న టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో సంప్ర‌దింపులు జ‌ర‌గ‌డం..ఎమ్మెల్యేగా బొండాకు సీటు ఇస్తే ‘రాధా’ స‌హ‌క‌రించి గెలిపించ‌డం, టిడిపి గెలిచిన త‌రువాత ‘రాధా’ను ఎమ్మెల్సీగా చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ఒప్పందం జ‌రిగిన‌ట్లు చెబుతారు. అనుకున్న‌ట్లే అన్నీ జ‌రిగి టిడిపి కూట‌మి బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతోఅధికారంలోకి వ‌చ్చింది. ఇక ‘రాధా’కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడు ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల్లో ఒక‌టి సీనియ‌ర్ టిడిపి లీడ‌ర్ రామ‌చంద్ర‌య్య‌కు, రెండోది జన‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి అయిన హ‌రిప్ర‌సాద్‌కు కేటాయించారు. దీంతో ఇప్పుడు రాధాకృష్ణ‌కు ఎమ్మెల్సీగానీ, మంత్రి ప‌ద‌వికానీ వ‌చ్చే అవ‌కాశ‌మే క‌నిపించ‌డం లేదు. 

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ‘రాధాకృష్ణ‌’కు అడ్డుప‌డుతున్న‌దెవ‌రు..? అనే ప్ర‌శ్న‌లు ఆయ‌న స‌న్నిహితుల నుంచి వ‌స్తున్నాయి. ఎన్‌డిఏ కూట‌మికి రెండు ఎమ్మెల్సీలు వ‌స్తే రెండూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి ఇవ్వ‌డం వెనుక ఏమి కుట్ర జ‌రిగింది. ‘రాధాకృష్ణ‌’కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఉండేందుకే రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఒకే సామాజిక‌వ‌ర్గానికి ఇచ్చారంటున్నారు. వాస్త‌వానికి టిడిపి అధినేత ‘చంద్ర‌బాబునాయుడు’ రాధాకృష్ణ ప‌ట్ల సానుకూలంగానే ఉన్నారు. కులాల కోణంలోంచి చూసినా, ‘రాధాకు ఉన్న అభిమాన‌గ‌ణాన్ని చూసినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం స‌రైన‌దే అనే భావ‌న ఆయ‌న‌లో ఉన్న‌ద‌ని చెబుతారు. అయితే..‘రాధాకృష్ణ‌’కు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌డం ఎన్‌డిఏలోని కీల‌క‌శ‌క్తికి ఇష్టం లేద‌ని, అందుకే ఆ సామాజిక‌వ‌ర్గానికి రెండు ఎమ్మెల్సీలు ఇచ్చి బ్యాలెన్స్ చేశారంటున్నారు. ఎన్‌డిఏ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించిన నాయ‌కునికి త‌మ సామాజిక‌వ‌ర్గంలో మ‌రో నేత ఎద‌గ‌డం ఇష్టం లేద‌ని భావిస్తున్నార‌ని, అందుకే..‘రాధాకృష్ణ‌’కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని చెబుతున్నారు. ఆ అదృశ్య‌శ‌క్తి త‌మ నేత‌ను అడ్డుకుంటుంద‌ని ‘రాధా’ స‌న్నిహితులు అంత‌రంగిక సంభాష‌ణ‌లో అంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న ‘వంగ‌వీటి’ కుటుంబం రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అదృశ్య‌శ‌క్తులు అడ్డుప‌డుతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ