వైకాపాలో ప్రతిదానికి రేటే...!
అత్యంత ఘోరమైన పరాజయం తరువాత వైకాపా పార్టీలో ఉన్నలోపాలు ఒకదాని తరువాత ఒకటి బయటకు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు చాలా మంది జగన్ అజేయుడు అతనని జయించడం కష్టమనే వ్యాఖ్యలు, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వినిపించేవి. కొంత మంది మేధావుల ముసుగేసుకున్న వారు..మళ్లీ జగనే..అంటూ ఆయనకు భుజకీర్తులు తొడిగేవారు. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, చైన్నె వంటి నగరాల్లో ఏసీ రూముల్లో ఉండేవారు, కొంత మంది ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారులు కూడా ఇలా చెపుతూఉండేవారు. ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికలు చదివేవారిలో ఎక్కువ మంది జగన్ గెలుస్తారని అంచనాలు వేశారు. అలా అంచనాలు వేయడమే కాకుండా అదే విషయాన్ని వారు ఎక్కడకు వెళ్లినా ప్రస్తావించేవారు. అయితే..ఆంధ్రాప్రజలు సమయం వచ్చినప్పుడు చాచిలెంపకాయ కొట్టినట్లు తీర్పు ఇచ్చారు. సరే..ఇదంతా జరిగిపోయిన విషయం అనుకోండి. ఇప్పుడు ఓటమి తరువాత వైకాపాలో ఏమి జరిగిందో వైకాపా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో జగన్‌కు భయపడి నోరెత్తనివారంతా ఇప్పుడు నోరు తెరిచి వైకాపాలో ఏమి జరిగిందో చెబుతున్నారు. జగన్ తాడేపల్లి ఇంటిలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు బహిరంగ పరుస్తున్నారు. జగన్‌ను కలవడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో..వారు వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజలను కలవడం మానుకున్న జగన్, స్వంత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడానికి కూడా ఇష్టపడలేదన్న సంగతి జగమెరిగిన సత్యమే. అయితే..కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు జగన్‌ను కలవడానికి వెళితే..ఏమి జరిగిందో..ఇప్పుడు వివరంగా చెబుతున్నారు.
ప్రతిదానికీ రేటే...!
జగన్ ను కలవాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఇది అందరి నాయకుల విషయంలో జరిగేదే. కానీ..పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జగన్ అపాయింట్‌మెంట్ కోరితే..జగన్ వ్యక్తిగత సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తారట. అపాయింట్‌మెంట్‌కు ఇంత రేటు, ఫోటో తీసుకుంటే ఇంత రేటని ఉంటుందట. అక్కడి వెళ్లిన నాయకులకు జగన్‌ను కలిసిన తరువాత..అక్కడ ఉన్న సిబ్బంది వచ్చి సార్‌ను కలిపించాం కదా...? మాకేమీ లేదా...? అని అడుగుతారట...సరే..ఎంతో కొంత ఇద్దామని ఇస్తే..సార్..పది మందిమి ఉన్నాం..ఇదెక్కడ సరిపోతుంది...అని డిమాండ్ చేసి తీసుకుంటారట. కేవలం ఇదొక్కడే కాదు..జగన్ ఎక్కడ ఉన్నాడో..ఎక్కడకు వెళుతున్నాడో..చెప్పడానికి కూడా ఓ రేటు ఉందట. ఆయన కదలికలు చెప్పినందుకు ఆయన సిబ్బంది, తాడేపల్లి ప్యాలెస్‌లో పనిచేసేవారు లంచాలు డిమాండ్ చేస్తారట. జగన్ వ్యక్తిగత కార్యదర్శి కూడా ఇదే కోవకు చెందిన వారేనట. మొత్తం మీద ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవని, జగన్ కూడా ఫక్తు వ్యాపారిలా వ్యవహరించారని, స్వంత పార్టీ కార్యకర్తలను, నాయకులను కలవడానికి కూడా ఆయనకు ఇష్టం ఉండదని, వారిపై ఎటువంటి ఆప్యాయత చూపించరని, ఆయన పొరపాటున కలిసినా..మొక్కుబడిగా వ్యవహరిస్తారని, వారంతా పార్టీకి సేవ చేస్తున్నారనే కృతజ్ఞత ఆయనకు ఉండదని కొందరు పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులంతా ఎవరి దుకాణం వారు పెట్టుకున్నారని, ఒకరి దగ్గరకు వెళ్లిన వారు..మరొకరి దగ్గరకు వెళితే..అగ్గిమీద గుగ్గిలం అవుతారని, ఇదంతా అధినాయకత్వానికి తెలుసనని కూడా కొందరు చెబుతున్నారు. పార్టీ సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి వంటి వారు ఒకరితో ఒకరు పోటీపడి పార్టీని ముంచేశారని వారు విమర్శిస్తున్నారు.