లేటెస్ట్

‘అప్పట్లో...‘ఆది’...ఇప్పుడు...‘వంశీ’...!

రాజకీయాలు నిశ్చలమైనవి కావు..అవి..రోజురోజుకు మారిపోతుంటాయి. ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు..! ఈ రోజు ఈ పార్టీలో ఉన్న నేతలు రేపు ఏ పార్టీలో ఉంటారో..ఎవరికీ తెలియవు. సిద్ధాంతాలు..ఆశయాలు..నైతికత..ఇలాంటి పదాలకు నేటి రాజకీయాల్లో తావు లేదు. అధికారం ఎక్కడ ఉంటే..నాయకులంతా..అక్కడే...! ఏ పార్టీ నుంచి గెలిచామన్నది ముఖ్యం కాదు..! అధికారం అందుకున్నామా..? లేదా..అధికారానికి దగ్గరగా ఉన్నామా..అనేదే ముఖ్యం...జాతీయ రాజకీయాల్లో అయినా...! రాష్ట్ర రాజకీయాల్లోనైనా...అదే పరిస్థితి. మిగతా..రాష్ట్రాల్లో ఈ పరిస్థితి..కొంచెం అటుఇటుగా ఉన్నా..ఆంధ్రా..తెలంగాణాలో మాత్రం...పరిస్థితులు పైన చెప్పుకున్న విధంగానే ఉన్నాయి. ‘ఆంధ్రా’లో రాజకీయపరిణామాలు మరింత దిగజారిపోతున్నాయి. అధికార..ప్రతిపక్షపార్టీలు ఒకరిపై ఒకరు బూతులు లంఖించుకుంటున్నారు. ఇలా ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నా ఆయా పార్టీల అధినేతలు మాత్రం తమ పార్టీ నాయకులను అదుపులో పెట్టడం లేదు. అంతే కాదు..తమ పార్టీ నాయకులు మాట్లాడే బూతులకు మద్దతు ఇస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇదలా ఉంచితే..అధికార పార్టీ నాయకులు...టిడిపి అధినేత చంద్రబాబు, అతని కుమారుడు ‘లోకేష్‌’పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిని రాయడానికి వీలు లేని బూతులతో దూషిస్తున్నారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాత్రమే కాదు..టిడిపి నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన  ‘వల్లభనేని వంశీ’ టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై నిన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన తనంత తాను అలా తిడుతున్నాడో..లేక ముఖ్యమంత్రి జగన్‌ చెప్పడంతో అలా చేస్తున్నాడో తెలియదు కానీ..ఆయన మాత్రం తన నోటికి పనిచెప్పి ప్రజల్లో చులకన అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షనేత ఆయన కుటుంబంపైకి ‘జగన్‌’ ‘వంశీ’ని వదిలారని టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే..వారి మాటలకు వైకాపా నేతలు గతాన్ని గుర్తు చేస్తున్నారు.


టిడిపి అధికారంలో ఉన్నప్పడు వైకాపా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపు 21 మందిని టిడిపిలో చేర్చుకున్నారు. అయితే నాడు టిడిపిలో చేరిన వారిలో మిగతా ఎమ్మెల్యేలు ఎలా ఉన్నా కడప జిల్లాకు చెందిన ‘ఆదినారాయణరెడ్డి’ ‘జగన్‌’పై విరుచుకుపడేవారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే అవి రాజకీయ విమర్శలుగానే ఉండేవి. అప్పల్లో ‘చంద్రబాబు’ ‘ఆది’తో అలా విమర్శలు చేయిస్తున్నారని వైకాపా నేతలు మండిపడేవారు. ‘జగన్‌’ సామాజికవర్గానికే చెందిన ‘ఆదినారాయణరెడ్డి’తో ‘జగన్‌’ను ‘చంద్రబాబు’ విమర్శలు చేయించారని అప్పట్లో ఆయన సామాజికవర్గానికి చెందిన వారు..తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వారు..ఆ కసిని చూపించి ‘ఆది’ని ఓడిరచారు. టిడిపి ఓడిపోవడంతో..ఆ పార్టీలో ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన ‘ఆది’ వెంటనే ‘బిజెపి’లో చేరారు. గతంలో జరిగిందే..ఇప్పడు టిడిపి అధినేత ‘చంద్రబాబు’ విషయంలో జరుగుతుంది. తన సామాజిక వర్గానికి చెందిన ‘వంశీ’తోనే...‘చంద్రబాబు’ను ‘జగన్‌’ తిట్టిస్తున్నారు. అయితే..అప్పట్లో ‘ఆది’ కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తే నేడు..‘వంశీ’మాత్రం..‘చంద్రబాబు’ ‘నందమూరి’ కుటుంబాలకు చెందిన మహిళలను కించపరుస్తూ వారి అగౌరపరుస్తున్నారు. ఇప్పడు అధికారంలో ఉన్నారు కనుక..ఓకే...రాబోయే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే..‘వంశీ’ పరిస్థితి ఏమిటి? గతంలో టిడిపి తమను, తమ కుటుంబ సభ్యులను తిట్టినా అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ..ఈ సారి మాత్రం అలా ఉండదని వారు బహిరంగంగానే చెబుతున్నారు. రేపటి ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే..‘వంశీ’ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అయితే..తమ నేతకు ఆ బాధ లేదని, ఒక వేళ వైకాపా ఓడిపోతే..‘వంశీ’ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జాతీయపార్టీలో చేరతారని, దాంతో ఆయనపై కక్షసాధింపు చర్యలు ఎవ్వరూ చేయలేరనే భావనతో ఉన్నారట. ఇప్పుడు ‘ఆది’ని ‘బిజెపి’ ఎలా రక్షిస్తుందో..రేపు..తన పరిస్థితీ అంతేనని ‘వంశీ’ తన సన్నిహితులతో అంటున్నారట. మొత్తం మీద..గతంలో ఏమి జరిగిందో..ఇప్పడూ అదే జరుగుతుందని రాజకీయవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ