వాళ్లు ప్రవేట్‌గా...వీళ్లు పబ్లిక్‌గా...!?
కొన్ని సన్నివేశాలు ప్రజలకు ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. అటువంటి సన్నివేశాలు ఈ రోజు హైదరాబాద్ ప్రజాభవన్ సాక్షిగా చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిల భేటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏడు నెలల క్రితం తెలంగాణలో రేవంత్‌రెడ్డి గెలవడం, తరువాత ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ప్రజలు ఆశించారు. వారు ఆశించిన విధంగానే నేడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి ఆయా సమస్యలపై సానుకూలంగా చర్చించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే..ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీని గతంతో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేసిన కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిల మధ్య జరిగిన భేటీలో పోలుస్తున్నారు. ఐదేళ్ల క్రితం వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు జగన్‌ను అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్ ఆహ్వానించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం అంటూ వారు భేటీ అయ్యారు. అయితే..ఆ భేటి మాత్రం చాలా రహస్యంగా, గుంభనంగా జరిగింది. ఈ భేటీకి మీడియాను వారు ఆహ్వానించలేదు. మీడియాను దూరంగా పెట్టి వారు అదేదో వారి కుటుంబ సమస్యలు చర్చించుకున్నట్లు మాట్లాడుకుని, ఒకొరికొకరు విందుభోజనాలు తినిపించుకుని బయటకు వచ్చారు. అధికారికంగా భేటీ అన్నప్పుడు మీడియాను రానీయకుండా, వారు చర్చించిది ఏమిటో చెప్పకుండా వారు గుంభణంగా వ్యవహరించారు.
నాటి వారి భేటీలో చంద్రబాబు ఓటమికి తాను చేసిన సహాయం, అందుకు పెట్టిన నిధులను తిరిగి లాక్కోవడమే ధ్యేయంగా, ఇరువురికి లాభదాయకమైన అంశాలపై చర్చించుకున్నారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కెసిఆర్ తనకు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుని ఆంధ్రాకు చెందిన సచివాలయ భవనాలను ఎటువంటి షరతులు లేకుండా తెలంగాణకు జగన్ అప్పగించారు. అప్పట్లో ఆంధ్రా అంటే జగన్, తెలంగాణ అంటే కెసిఆర్ అన్నట్లు, వారిద్దర మధ్య ప్రవేట్ వ్యవహారం అన్నట్లు సాగింది వారి భేటీ. అయితే..ఈరోజు జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బహిరంగంగా, లైవ్ టీవీల మధ్య జరిగింది. చంద్రబాబు, రేవంత్‌రెడ్డిల భేటీలో వారితో పాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రలు,ఆంధ్రాకు చెందిన మంత్రులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. నాటి భేటీలో కేవలం వారి వారి వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి సారించగా,నేటి సమావేశంలో ప్రజాంశాలు చర్చించారు. కాగా నాటి భేటిని, నేటి భేటిని కొందరు సోషల్ మీడియాలో పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా..ఈ భేటీ నచ్చని బిఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరిపాలయిందిరో.. తెలంగాణ..ఎవరేలుతున్నారురో..అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి కొందరు గురుశిష్యులు తెలంగాణను ఏలుతున్నారంటూ, తెలంగాణలో మళ్లీ ఆంధ్రాపెత్తనం వస్తోందంటూ సెంటిమెంట్‌ను రంగరించడానికి యత్నిస్తున్నారు.