చక్రం తిప్పిన I&PR అధికారులపై వేటు...!?
ఐదేళ్ల జగన్ పాలనాకాలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి, జగన్ కు దోచిపెట్టిన I&PR అధికారులపై త్వరలో వేటు పడబోతోంది. ఐదేళ్లు I&PR కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు, జగన్ మందిమాగాధులకు, జగన్ కులస్థులకు భారీగా దోచిపెట్టారు. ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన కమీషనర్ ప్రజల సొమ్మును అప్పటి ముఖ్యమంత్రి కుటుంబానికి లెక్కాపత్రం లేకుండా అప్పనంగా కట్టబెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు విచారణ జరగబోతోంది. విచారణ జరిగితే తనపై కేసులు పెట్టి జైలుకు వెళతారనే భయంతో..నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో రిపోర్టు చేయడం, వారు తిరస్కరించడంతో..ఇప్పుడు జిఏడీ చుట్టూ తనను రిలీవ్‌చేయాలని సదరు కమీషనర్ చక్కర్లు కొడుతున్నారు. కమీషనర్ పరిస్థితి ఇలా ఉంటే..కమీషనర్ అండ చూసుకుని రెచ్చిపోయిన కొందరు అధికారులు జరుగుతున్న పరిణామాలను చూసి బెంబేలెత్తుతున్నారు. ఐదేళ్లూ I&PRను వైకాపా కార్యాలయంలా మార్చి, ఇష్టారాజ్యంగా వ్యవహరించి, సాటి ఉద్యోగులను రాచి రంపాన పెట్టిన వారిపై ఇప్పుడు ప్రభుత్వం కొరఠా ఝలిపించబోతోంది. I&PR అంటే తన స్వంత ఇళ్లు అన్నట్లు వ్యవహరించిన అధికారిపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. అంతా నా ఇష్టమే అన్నట్లు వ్యవహరించిన సదరు అధికారికి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు సదరు అధికారి కూడా జైలుకు వెళతారని I&PRకే చెందిన అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. తమను ఆ అధికారి ఎలా వేధించారో కథలు కథలుగా వారు చెబుతున్నారు. అదే సమయంలో సదరు అధికారి అవినీతి గురించి కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. చక్రం తిప్పిన అధికారితో పాటు, రాత్రిళ్లు బిర్యానీపార్టీలు, మందు పార్టీలు చేసుకున్న అధికారులపై కూడా వేటు పడబోతోంది. యాడ్ డిజైన్స్ పేరిట దోచిన సొమ్ములో వాటాలు పంచుకున్నవారు, సిసీ టీవీల పేరుతో ఎలక్ట్రానిక్ మీడియాలో చక్రం తిప్పిన అధికారి కూడా ఇప్పుడు విచారణను ఎదుర్కోబోతున్నారు.కాగా కమీషనర్‌కు కాపాలా కాసిన అధికారికి కూడా అవినీతిలో వాటా ఉందని శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. సదరు కాపాలదారు తన స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడని కూడా వారు అంటున్నారు. విజయ్‌కుమార్‌రెడ్డికి సహకరించిన వారు చాలా మంది ఉన్నా ముందు ముగ్గురు సీనియర్ అధికారులపై వేటు పడుతుందని, తరువాత మరికొందరిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు జనమ్ఆన్‌లైన్.కామ్‌తో వ్యాఖ్యానించారు. కాగా తమపై చర్యలు తీసుకోవద్దంటూ, తాము ఎటువంటి అక్రమాలు చేయలేదని, అంతా కమీషనర్ చెప్పినట్లే చేశామని చెబుతూ ఈ శుద్ధపూసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ కోసం తిరుగుతున్నారట. అయితే I&PRపై ఇప్పటికే చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చారని, విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయనకు అండగా ఉన్నవారందరినీ బోనెక్కిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ఐదేళ్ల I&PR అరాచకాలకు త్వరలో శుభం కార్డు పడుతుందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.