విలీనం దిశగా I&PR...!?
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పిడిన ఎన్‌డిఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబొతోందిని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు రాష్ట్ర సమాచారశాఖను సాంస్క్రృతిక శాఖలో కానీ, పర్యాటకశాఖలో కానీ విలీనం చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. సమాచారశాఖలో ఇప్పటికే ఉన్న ఫిలిమ్‌డెవలప్‌మెంట్, మరో రెండు శాఖలను కలిపాలని, దీనిలో రాష్ట్ర సమాచారశాఖను కూడా కలుపుతారని ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన ఈ శాఖ గత ఐదేళ్ల్లో వైకాపా కార్యాలయంలా పనిచేసిందని, దీనిలో పనిచేస్తోన్నవారంతా వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారనే భావన టిడిపి వర్గాల్లో ఉంది. అంతే కాకుండా సమాచారశాఖ ఉద్యోగులకు పెద్దగా పనిలేదని, క్షేత్రస్థాయిలో కొంత మంది మాత్రం పనిచేస్తున్నారని, మిగతావారంతా కార్యలయాలకు మాత్రమే పరిమితమవుతున్నారనే భావన పాలకుల్లో ఉంది. వాస్తవానికి సమాచారశాఖ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈశాఖ పనితీరు మందగించింది. దీనికి ఎవరు కారణమనే విషయంలోకి వెళ్లలేం..కానీ..దీన్ని ఉపయోగించుకోవాల్సిన పాలకులు దీన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకున్నారని, చివరకు దీని వల్ల ఉపయోగం లేదనే పరిస్థితికి తెచ్చారనే భావన ఉంది. దీనిలో ఎవరు పాత్ర ఎంతో..అనేది చర్చించుకోవడం అనవసరం. గత కొన్నాళ్లుగా సమాచారశాఖ కేవలం యాడ్స్ విడుదల చేయడంలోనే కీలకంగా వ్యవహరిస్తోంది. దీనిలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం ఉంది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డిపై, ఆయన సన్నిహితులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వీరి అవినీతిపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే..ఇప్పుడు ప్రభుత్వం అసలు శాఖనే వేరే శాఖలో విలీనం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు దాటినా ఇంత వరకూ సమాచారశాఖకు కమీషనర్‌ను నియమించలేదు. దీంతో..ఈశాఖ అనవసరం అనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అందుకే కమీషనర్‌ను నియమించలేదని, వేరేశాఖలో విలీనం చేసి, ఇక్కడ ఉన్న ఉద్యోగులను వేరే పనులకు ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఆలోచన ఉందని, అందుకే కమీషనర్‌ను నియమించలేదని చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకూ కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అవడంతో ఆయన ఇప్పుడు పదవిలో ఉన్నట్లో లేనట్లో...? అన్న అనుమానాలు ఉన్నాయి. ఆయనను రిలీవ్ చేయలేదని, ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా, తాను రిలీవ్ అయినట్లు ఆయన చెప్పుకుంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే..రికార్డుల ప్రకారం విజయ్‌కుమార్‌రెడ్డే కమీషనర్ కానీ, ఆయన కార్యాలయానికి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనను తొలగించి, నూతన కమీషనర్‌ను ప్రభుత్వం నియమించాలి. కానీ..ప్రభుత్వ పెద్దలు ఆ ఆలోచన చేయడం లేదు. శాఖను వేరే శాఖలో విలీనం చేసేందుకే, ప్రభుత్వం ఇలా చేస్తుందనే ప్రచారం ఉంది.మొత్తం మీద సమాచారశాఖను ప్రభుత్వం వేరేశాఖలో విలీనం చేస్తే అదో సంచలనమే అవుతుంది. అయితే..ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సమాచారశాఖ వేరేశాఖలో భాగంగా ఉండేదని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ విలీనం చేస్తే ప్రభుత్వానికి, జర్నలిస్టులకు నష్టమనే భావన వారిలో ఉంది. జర్నలిస్టు పక్షపాతిగా ఉన్న సిఎం చంద్రబాబు ఇలా చేయరని కూడా వారు అంటున్నారు. ఒక వేళ అలాకనుక జరిగితే అది మాత్రం సంచలనమే..!