I&PR విజయ్‌కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణ
అధికారంలో ఉన్నప్పుడు అంతులేని అవినీతి, అక్రమాలకు, అంతులేని అధికారాన్ని చలాయించిన అధికారులకు ఎన్‌డిఏ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. జగన్‌కు కట్టుబానిసల్లా పనిచేసిన వారిపై ఇప్పుడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఐదేళ్లు రాష్ట్ర సమాచారశాఖను తన ఇళ్లులా వాడుకున్న విజయ్‌కుమార్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనతో పాటు అప్పట్లో అవినీతికి పాల్పడిన శాఖకు చెందిన ఉన్నతాధికారులపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లోపేర్కొంది. గత ఐదేళ్లలో I&PRలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయబోతోందని, దీనిలో చక్రం తిప్పిన అధికారులూ ఉంటారని Janamonline.com కొన్నాళ్లుగా కథనాలను ప్రచురిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ఐదేళ్ల పాలనాకాలంలో I&PRలో వందలకోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని పలు జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీనిపైనే ఇప్పుడు విచారణ జరగబోతోంది. కాగా ఎన్నికల సమయంలో మళ్లీ జగన్ గెలుస్తారని అంచనా వేసిన కమీషనర్ తన డిప్యూటేషన్‌ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేసుకున్నారు. అయితే ఆయన అంచనా వేసినట్లు జగన్ మళ్లీ గెలవలేదు. ఎన్‌డిఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో, తన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ఆయన ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి పరార్ అయ్యారు. తాను ఆంధ్రాలో రిలీవ్ అయ్యానని, తనను కేంద్రం మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరారు. అయితే..కేంద్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఆంధ్రా నుంచి రిలీవ్ అయినట్లు లేఖ తేవాలని కోరడంతో విజయ్‌కుమార్‌రెడ్డి ఖంగుతిన్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఇక్కడకు వచ్చి తనను రిలీవ్ చేయాలని జిఏడీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఆయన అక్రమాలను నిగ్గుతేల్చేవరకూ ఆయనను రిలీవ్ చేసేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆయన అటూ ఇటూ కాకుండా మిగిలిపోయారు. కాగా ఇప్పుడు ఆయన అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల విచారణతో పాటు ఆయనకు సహకరించిన చక్రం తిప్పిన అధికారి, ఇంజనీరింగ్ విభాగంలో జగన్‌కు తొత్తులా పనిచేసిన అధికారి కూడా విచారణ పరిధిలోకి రానున్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్లు కూడా విచారణను ఎదుర్కోబోతున్నారు. కాగా..తనను ఎవరూ ఏమీ చేయలేరని, తనను ఏమైనా చేస్తే తన కులానకి చెందిన వారు రోడ్లు ఎక్కుతారని ఓ అధికారి తన సన్నిహితుల వద్ద బెదిరింపులకు దిగుతున్నారట. కాపాలాకాసిన వ్యక్తి కూడా తాను ఏమీ చేయలేదని, అంతా వారే చేసుకున్నారని చెబుతున్నారట. అయితే..వీరు ఏమి చెప్పుకున్నా..విచారణ ఆగదని, అక్రమాలకు పాల్పడ్డవారంతా బోను ఎక్కాల్సిందేనని, అడ్డగోలు వ్యవహారాలు నడిపిన వారందరూ ఉద్యోగాలు కోల్పోయి కటకటాలకు వెళతారని సమాచారశాఖకు చెందిన మరికొందరు ఉద్యోగులు అంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంపై జర్నలిస్టు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.