అర్థంతరంగా వినయ్‌చంద్ బదిలీ ఎందుకో...!?
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భారీ ఎత్తున్న ఐఏఎస్, ఐపిఎస్‌లను బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికార వ్యవస్థలో జరిగిన భారీ మార్పులు ఇవి. దాదాపు అన్నిశాఖలకు నూతన బాస్‌లను ప్రభుత్వం నియమించింది. గతంలో పోస్టింగ్‌లు లేని అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో కీలకశాఖలను నిర్వహించిన అధికారులను తప్పించి, ఆయా పోస్టుల్లో తమకు నమ్మకమైన వారిని చంద్రబాబు ప్రభుత్వం నియమించుకుంది. అయితే..కొందరు అధికారుల బదిలీలపై అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు స్టడీలీవ్‌లోఉన్న వినయ్‌చంద్ ను ఆర్థికశాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అప్పట్లోనే ఈ నియామకంపై అధికారవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేయని ఆయనను నేరుగా ఆర్థికశాఖలో ఎలా నియమించారో అన్న చర్చ జరిగింది. అయితే ఆయన గతంలో వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. టిడిపి హయాంలో ప్రకాశం, విశాఖ జిల్లాలకు ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేసేవారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడంతో వినయ్‌చంద్‌ను కీలకమైన ఆర్థికశాఖకు తీసుకున్నారని, ఆయన సేవలను వాడుకుంటారనుకున్నారు. అయితే..హఠాత్తుగా ఈరోజు ఆయనను పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. హఠాత్తుగా కీలకమైనశాఖకు ఆయనను తీసుకోవడం ఏమిటి...? పక్షం రోజులు కూడా కాకుండా బదిలీ చేయడం ఏమిటి..? అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలియడం లేదని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. గత వైకాపా పాలనలో జగన్‌కు భక్తుల్లా పనిచేసిన ఎంతో మంది ఐఏఎస్ అధికారులకు చంద్రబాబు మంచి పోస్టులు ఇచ్చారు. అయితే..ఎటువంటి మచ్చలు లేని వారని మాత్రం పక్కన పెడుతున్నారనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. వినయ్‌చంద్ విషయంలో ఏమి జరిగిందో ఇంకా బయటకు రాలేదు. కానీ ఇంత త్వరగా కీలకశాఖ నుంచి తప్పించడం సంచలనమే. కాగా ఆర్.పి.సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ, జి.జయలక్ష్మికి సిసిఎల్, కాంతిలాల్‌దండేకు ఆర్ అండ్ బీ, సురేష్‌కుమార్‌కు పెట్టుబడులు,మౌళికసదుపాయాలతోపాటు జీఏడీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సారభ్‌గౌర్‌కు ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. గిరిజాశంకర్ ను ఆర్థికశాఖ నుంచి తప్పించారు. మొత్తం మీద పాలనావ్యవస్థలో మార్పులు తేవడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార వ్యవస్థను ప్రక్షాళన చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.