లోకేష్ తొలి సిక్సర్...!
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా నెలరోజులు. ఈ నెల రోజుల్లోనే పాలనలో గణనీయమైన మార్పులు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ముందుగా వాగ్ధానం చేసినట్లే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఎస్సీ ప్రకటించారు. ఆ తరువాత ఫించన్లు రూ.7వేలును రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అదే సమయంలో అమరావతి, పోలవరంపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. ఒక వైపు సంక్షేమం, రెండోవైపు అభివృద్ధే తమ అజెండా అని కూటమి ప్రభుత్వం తొలి నెలలోనే చాటి చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి వలే పాలన, సంక్షేమంపై దృష్టిపెడితే..మంత్రివర్గంలో ఉన్న పలువురు మంత్రులు ఆయన బాటలో నడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది తొలిసారి మంత్రులు అయిన వారు అవడంతో..కొంత మంది ఇంకా పనిలో పడలేదు. అయితే..కొందరు మంత్రులు మాత్రం అప్పుడే శాఖలపై పట్టుసాధించి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా చేస్తున్నవారిలో విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌లు ఉన్నారు. వీరిలో అందరి కన్నా ముందుగా పవన్‌కళ్యాణ్ వార్తల్లోకి వచ్చారు. ప్రేమపేరుతో మోసపోయిన ఓ అమ్మాయిని రక్షించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. దీంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లోకి వచ్చారు. అయితే..ఆయన పార్టీకే చెందిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా తనశాఖలో పనిచేసుకుంటూపోతున్నారు. అక్రమ బియ్యం సరఫరాదారుల గుండెల్లో ఆయన రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసుకుంటూపోతున్నారు. గతంలో మంత్రిగా ఎటువంటి అనుభం లేని ఆయన తొలి రోజు నుంచే శాఖపై పట్టుసాధించారనే పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్‌గా పనిచేసిన అనుభం ఉన్న ఆయన మంత్రిగా తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే..ఈ నెలరోజుల్లో అందరి కన్నా ఎక్కువ మార్కులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కే పడతాయి.
మంత్రుల్లో లోకేషే నెంబర్‌వన్...!
గత టిడిపి ప్రభుత్వంలో పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన లోకేష్ అప్పట్లో పంచాయితీరాజ్ పై తిరుగులేని ముద్రవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసి...రికార్డు సృష్టించారు. అప్పట్లోనే ఆయన పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కాగా ఇప్పుడు రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఎంతో క్లిష్టమైన విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మంత్రిగా తొలిరోజునుంచే ఆయన ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. ప్రజలు విన్నవించే సమస్యలను నేరుగా వింటూ ఆయన అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సమస్యలను విన్నవిస్తున్నారు. దివ్యాంగ విద్యార్ధుల సమస్యను ఆయన పరిష్కరించిన తీరుతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. రాష్ట్రం నుంచి ఐఐటిలో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్ధులకు నిబంధనల పేరుతో ఆయా సంస్థలు సీట్లు నిరాకరిస్తే..గంటల్లోనే నిబంధనలు మారుస్తూ జీవోలను విడుదల చేయించి, దివ్యాంగ విద్యార్ధులకు ఐఐటీలో సీట్లు ఇప్పించారు. దీంతో ఆయన పనితీరుపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి దివ్యాంగ విద్యార్ధుల సీట్ల విషయం గురించి పెద్దగా ఎవరికీ అవగాహన లేదు. అయితే...లోకేష్ ఫోన్ నెంబర్‌ను ఓ విద్యార్ధి సంపాదించి తమ సమస్యను ఆయనకు వివరించగా..వాట్సప్‌లో వచ్చిన మెస్సేజ్‌కు లోకేష్ స్వయంగా స్పందించడంతో వారి సమస్య వెలుగులోకి వచ్చింది. సమస్య పరిష్కారానికి ఏమి చేయాలో అధికారులను అడిగి తెలుసుకుని వేగంగా వారి సమస్యను పరిష్కరించడంతో ప్రజల్లో, రాజకీయ, అధికారవర్గాల్లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిగతా మంత్రుల కన్నా లోకేషే పనిమంతుడని, మానవీయంగా వ్యవహరించారనే పేరు వచ్చింది. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న మంత్రులందరిలోకి లోకేషే వేగంగా,మానవత్వంతో పనిచేస్తున్నారనే పేరు రావడంతో ఆయనను కలవడానికి జనం కుప్పలు, తెప్పలుగా వస్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే..అక్కడకు వేలాది మంది వస్తున్నారు. చివరకు సచివాలయంలోని ఆయన ఛాంబర్ వద్ద జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆయనను ఒక్కసారి కలిసి తమ సమస్య చెబితే..ఆయన పరిష్కరిస్తారనే నమ్మకంతో వారంతా ఆయన ను కలవడానికి ఎగబడుతున్నారు. ఎన్‌డిఏ మంత్రుల్లో ఎవరికీ ఇంత ప్రజామోదం లేదు. లోకేష్ రెండో విడత మంత్రిగా తొలి నెలరోజుల్లోనే తొలి సిక్సర్ కొట్టారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మొత్తం మీద నెల రోజుల ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వ పాలనలో లోకేష్ తో పాటు మరికొందరు మంత్రులు వేగంగా పనిచేస్తున్నారని, మిగతా వారు కూడా స్పీడు అందుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.