మాజీ సిఎం జగన్‌పై కేసు నమోదు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఆయనతో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కూడా నగరంపాలెం పిఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సిఎం జగన్ తనపై హత్యాయత్నం చేయించారని టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆయనపై పలు సెక్షన్ల క్రింద కేసు పెట్టారు. సీఐడీ కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని, తనను అక్రమంగా అరెస్టు చేయించడంలో అప్పటి ముఖ్యమంత్రి పాత్ర ఉందని, తనను జగన్ ప్రోద్భలంతోనే హింసించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నరు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎ3గా పోలీసులు పేర్కొన్నారు. ఎ1గా సునీల్‌కుమార్, ఎ2గా ఐపిఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఎ4గా విజయ్‌పాల్, ఎ5గా డాక్టర్ ప్రభావతిగా పోలీసులు కేసులో చేర్చారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురు చెప్పారన్న కోపంతో అప్పట్లో తన పార్టీలో ఉన్న ఎంపి రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయించి, హింసించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వంతపార్టీకే చెందిన ఎంపినీ పోలీసులతో హింసించడం, చివరకు చంపేయించబోయారన్న ఆరోపణలు జగన్‌పై వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేసులో జోక్యం చేసుకోకపోతే తనను జగన్ చంపేయించేవారని రఘరామకృష్ణంరాజు ఇటీవల కాలంలో వెల్లడించారు. కస్టడీలో హింసించడం, ఆ హింసను నేరుగాజగన్‌కు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్ కీలకపాత్రపోషించారని రఘురామకృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లోనే ఆయన ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో..పోలీసులు మాజీ సిఎంజగన్‌పై, సునీల్‌కుమార్‌పై కేసులు నమోదు చేశారు.