ప్రెస్ అకాడమీ ఛైర్మన్ రేసులో సత్యమూర్తి, ఆలపాటి, కందుల...!
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో, వివిధ స్థానాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. పార్టీకి పనిచేసిన వారిని గుర్తించండి..ఆయన ఇప్పటికే పార్టీ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా మీడియా రంగానికి చెందిన వారు ప్రెస్ అకాడమీ ఛైర్మన్, ముఖ్యమంత్రి పిఆర్ ఒ పోస్టుల కోసం తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమించిన తరువాత, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి దక్కుతుందోననే ఆసక్తి జర్నలిస్టుల్లో నెలకొంది. అయితే..తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆపార్టీ వాయిస్ బలంగా వినిపించిన జర్నలిస్టులను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5, ఏబీఎన్, మహాన్యూస్‌ల్లో పనిచేసిన జర్నలిస్టులు కొందరు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే వీరికి అవకాశం వస్తుందా..? రాదా..అనేది పక్కన పెడితే..జర్నలిస్టులుగా సుధీర్ఘకాలం పనిచేసిన సత్యమూర్తి, ఆలపాటి సురేష్, కందుల రమేష్, అంకబాబు వంటి వారు ఈ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నలుగురు కాకుండా, వేరు వారు ఉన్నా..ఈ నలుగురి పేర్లే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే..ఈ నలుగురిలో అంకబాబు, ఆలపాటి సురేష్, కందుల రమేష్‌లు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు. సత్యమూర్తి బ్రాహ్మణ సామాజికవర్గాని చెందిన వారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరుపున ఈ సామాజికవర్గానికి ఎవరికీ సీట్లు కేటాయించలేదు. దీంతో..నామినేటెడ్ పదవుల్లోనైనా వీరికి న్యాయం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదీ కాక చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడానికి జంకుతారు కనుక సత్యమూర్తికి లైన్ క్లియర్ అయినట్లే. ఈయన చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడు. సుధీర్ఘకాలం జర్నలిస్టుగా, ఎడిటర్‌గా పనిచేసిన సత్యమూర్తిపై ఎటువంటి వివాదాలు లేవు. వివాదరహితుడు, సౌమ్యుడు అయిన సత్యమూర్తిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తే..ఆ పదవికి ఆయన హుందాతనాన్ని తేగలరు. అయితే..సత్యమూర్తికి ఆ పదవిపై ఆసక్తి లేదని, ఆయన సిఎంఓలోకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కాగా కందుల రమేష్ కూ అవకాశం ఉంది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు, టిడిపి తరుపున గట్టిగా పోరాడారు. ఇక ఆలపాటి సురేష్‌దీ అదే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన విరుచుకుపడతారు. సునిశిత విమర్శలు చేస్తూ ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. జగన్ మనస్తత్వంపైనా, ఆయన విధానాలపైనా సూటైన విమర్శలు చేస్తున్నారు. జగన్ మాజీ అయిన తరువాత కూడా ఆయన ఇదే బాటలో ఉన్నారు. కాగా సీనియర్ జర్నలిస్టు అంకబాబుది విచిత్రమైన పరిస్థితి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా వాట్సప్‌లో వచ్చిన ఓ సందేశాన్ని పార్వర్డ్ చేశారనే అభియోగాలతో ఆయనను అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. వయస్సు మీరిన జర్నలిస్టును అర్థరాత్రి అరెస్టు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వాస్తవానికి అంకబాబేమీ టిడిపి, చంద్రబాబు సానుభూతిపరుడు కాదు. ఆయనకు ఎంతో కొంత వైకాపాపైనే అభిమానం ఉందనే అభిప్రాయం జర్నలిస్టు వర్గాల్లో ఉంది. అయితే..ఆయన అరెస్టు తరువాత పరిస్థితి మారింది. కాగా ఇప్పుడు ఆయన కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ నలుగురిలో ఎవరో ఒకరికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దక్కుతుందనే అభిప్రాయాలు జర్నలిస్టు వర్గాల్లో ఉంది.