చంద్రబాబును జైలులో చూసి తట్టుకోలేకపోయాః లోకేష్
ఎటువంటి తప్పు చేయకున్నా తన తండ్రిని జైలులో పెట్టారని, ఆయనను జైలులో ఉండడం చూసి తట్టుకోలేకపోయానని టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన తప్పు చేయరని, రాజకీయ కక్షలతోనే చంద్రబాబును జైలులో పెట్టారని, ఎటువంటి తప్పు చేయకున్నా చంద్రబాబు ఇన్ని రోజులు జైలులో ఉండడం ఆవేదన కల్గిస్తోందని ఆయన అన్నారు. నిర్దోషులను జైలులో ఉంచితే ఎంత బాధ కలుగుతుందని, పరిస్థితులు ఇలా ఉంటే రాజకీయాల్లోకి ఎవరూ రారని, తన తండ్రి తప్పు చేయకపోయినా నేరాన్ని అంటగట్టాలని చూస్తున్నారని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా తన తండ్రికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని, ఎటువంటి తప్పు చేయని వారి ప్రభుత్వం వేధిస్తోందని, ఇందుకు వాళ్లు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారన ఆయన చెప్పారు. ఇటువంటి అరెస్టులతో టిడిపిని భయపెట్టలేరని, టిడిపి అనేది ఏనుగులాంటిదని, అది పరిగెట్టడం మొదలుపెడితే ఎవరూ దాన్ని ఆపలేరని, టిడిపి నాయకులు, కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన అధికారులను చట్టప్రకారం శిక్షిస్తామని,వారిపై న్యాయవిచారణకు ఆదేశిస్తామని తెలిపారు. సైకో జగన్ ఆటలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తమ విశ్వరూపం ప్రదర్శిస్తారని వారంతా కసితో ఉన్నారని ఆయన అన్నారు. తాను 4వ తేదీన సీఐడీ విచారణకు హాజరువుతానని, వాళ్లు అడిగిన వాటికి వివరణ ఇస్తానన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే టిడిపి, జనసేన కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామని, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని దీనిలో సందేహం లేదని ఆయన అన్నారు.