అంత ఫ్రస్టేషన్ ఎందుకో...!?
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వాడిన భాషపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విజయసాయిరెడ్డి తాను ఎంపీననే విషయం మరిచి, మరీ చిల్లరగా చేసిన కామెంట్లు, తిట్లు, శాపనార్ధాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక మహిళతో ఆయనకు అక్రమ సంబంధం ఉందని, ఆమెను గర్భవతిని చేశాడని, ఆ మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో..మీడియా దాన్ని ప్రచురించింది. అయితే..సోషల్‌మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఒక సున్నితమైన విషయంలో మర్యాదగా ప్రవర్తించాల్సిన మీడియా.. గీత దాటేసింది. మహిళా ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా వ్యవహరించిదనడంలో సందేహం లేదు. వాస్తవానికి వార్త ప్రచురించే ముందుకానీ, లేక టెలీకాస్ట్ చేసేముందు కానీ సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ తీసుకోవడం ఆనవాయితీ. అయితే..ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండా నేరుగా ఆయన పేరును వాడుతూ, ఫోటోలు వాడుతూ వార్తలు ప్రచురించడం సరైన చర్య కాదు. మీడియా చేసిన అతి వల్ల సదరు మహిళ తీవ్ర వేధనకు గురయ్యారు. కాగా..ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌లో వ్యవహరించిన తీరు, వాడిన భాష అత్యంత హేయం. మీడియా ప్రతినిధులపట్ల ఆయన ప్రవర్త నీచాతి నీచం. ఉపయోగించకూడని పదాలు యధేచ్ఛగా ఉపయోగిస్తూ, ఊగిపోతూ..అరె..ఒరే..అంటూ.. వాడూ..వీడూ..అంటూ కులాలు పేరును ఉచ్ఛరిస్తూ ఆయన వ్యవహరించిన తీరుతో ఆయన తీవ్ర ఫ్రస్టేషన్‌లో ఉన్నట్లు బహిర్గతమైంది. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తే సరిపోయేది. కానీ..ఎక్కడ లేని ఫ్రస్టేషన్ బహిర్గతం చేసి..దీని వెనుక ఏదో..జరిగిందనే అనుమానాలను ఆయనే కల్గించారు. ఆరోపణల్లో నిజం లేకపోతే..చేసిన వారిపై కేసులు నమోదు చేయిస్తే సరిపోయేది. కానీ..ఆయన ట్విట్టర్‌లో ఉపయోగించే నీచభాషను ఇక్కడా ఉపయోగించి...తాను ఎటువంటివాడో మరోసారి లోకానికి చాటుకున్నారు. మొత్తం మీద..విజయసాయిరెడ్డి ఫ్రస్టేషన్ ఆయన ప్రత్యర్ధులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచిందనడంతో అతిశయోక్తి లేదు.