వైకాపా రాజ్యసభ ఎంపీలు బిజెపిలోకా...లేక..టిడిపిలోకా...!?
సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన జగన్ పార్టీకి అసలైన కష్టాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. 175/175 స్థానాలు గెలుస్తానని విర్రవీగి చివరకు ప్రతిపక్షహోదా కూడా దక్కించుకోలేని జగన్ ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడమే గగనమేనన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి త్వరలో అతిపెద్ద దెబ్బ తగలబోతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ సభ్యులు వైకాపాను వీడతారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో..అక్కడ పలుబిల్లులు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఎన్‌డిఏ రాజ్యసభలో మెజార్టీ సాధించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రాలో ఉన్న రాజ్యసభ సభ్యులపై కన్నేసింది. వైకాపాకు రాజ్యసభలో 11మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ బిజెపిలో కలుపుకోవాలనే భావనతో ఆపార్టీ పెద్దలు ఉన్నారని, ఈ అంశం మాట్లాడేందుకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఢిల్లీకి పిలిపించారని మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
దక్షిణాదిలో ఎన్‌డిఏ బలపడేందుకు చంద్రబాబు సహాయం వారు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగా వైకాపా రాజ్యసభ సభ్యులను ఎన్‌డిఏ కూటమిలోకి తెచ్చే బాధ్యత చంద్రబాబుపై పెట్టారని ప్రచారం జరుగుతోంది. వైకాపా రాజ్యసభ సభ్యల్లో పలువురు ఇప్పటికే అధికార టిడిపి కూటమిలోకి వచ్చేందుకు యత్నాలు మొదలుపెట్టారు. అయితే..ఒక్కొక్కరిని తీసుకోకుండా వైకాపా మొత్తాన్ని విలీనం చేసుకోవాలనే ఆలోచనతో బిజెపి పెద్దలు ఉన్నారట. వైకాపాకు ఉన్న 11మంది రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు తప్ప అంతా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా టిడిపి మాత్రం వారిని తమ పార్టీలోకి తీసుకునేందుకు ఒప్పుకోవడం లేదని, వారంతా బిజెపిలో చేరితే పార్టీ ఫిరాయింపుల మట్టి తన చేతికంటదనే భావన చంద్రబాబులో ఉందంటున్నారు. వారిని ఏ పార్టీలో చేర్చుకోవాలనే విషయంపై అమిత్‌షా, చంద్రబాబుల మధ్య చర్చ జరుగుతుందని, వచ్చే వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. ఈరోజు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రేపు కూడా అక్కడే ఉంటారు. ఆయన ఢిల్లీలో ఒక ఇళ్లు తీసుకున్నట్లు, రేపు ఆ గృహానికి పూజలు చేస్తారని, తరువాత నుంచి ఆయన ఎప్పుడు వచ్చినా..అక్కడే ఉంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా..ఆయన ఎప్పుడూ ఢిల్లీలో ఇళ్లు తీసుకోలేదు. ఈసారి మాత్రం ఆయన తన తత్వానికి విరుద్ధంగా అక్కడ ఇళ్లు తీసుకున్నారు. ఎన్‌డిఏ అవసరాల కోసమే ఆయన అక్కడ గృహాన్ని తీసుకున్నారని, రాబోయే రోజుల్లో ఎన్‌డిఏలో ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది.