అధికార వ్యవస్థకు అలుసైన చంద్రబాబు...!?
రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు నెలన్నర అవుతున్నా...అధికార వ్యవస్థపై ఇంకా పట్టుసాధించలేకపోతోంది. అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎందుకో వ్యవస్థపై పట్టుసాధించలేకపోతున్నారు. ఆయనకు అధికారం కొత్తేమీ కాదు. నాల్గవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో ఆసలస్యం చేస్తున్నారనే విమర్శ ఇప్పటికే వచ్చింది. అయితే..ఇప్పుడు ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతున్నారని, ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం, బెంగ ఆయనలో కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికార వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ఆయన తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతంలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలున్న అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆయన జంకుతున్నారు. తాము అధికారంలోకి వస్తే..అవినీతి, అక్రమాలు చేసిన అధికారుల భరతం పడతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులు ఒకటే ప్రకటనలు చేశారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత వారిద్దరూ..ఆ సంగతే మరిచిపోయారు. అవినీతికి, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులు దర్జా తమ హోదాలను వెలగబెడుతున్నారు. కొందరికైతే..రాజీనామాలు, రిటైర్ట్‌మెంట్‌లు చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. దాంతో..వారు దర్జాగా తమను ఎవరూ ఏమీ చేయలేరని తాము ముందు నుంచి చెబుతున్నామని, ఇప్పుడు అదే జరిగింది కదా..అంటూ బీరాలు పలుకుతున్నారు.
రాష్ట్రంలోని అధికార వ్యవస్థలో మొత్తం ఇదే కనిపిస్తోంది. ముఖ్యంగా శాంతిభద్రతలకు సంబంధించిన అంశంలో పోలీసుశాఖ తీరు ప్రశ్నార్థకమైంది. ఈ శాఖలోని జగన్ భక్తులు ఇంకా ఆయనకు సహకరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా..రాష్ట్రంలో శాంతిభధ్రతలు కరువయ్యాయనే ప్రచారాన్ని వారే జోరుగా చేయిస్తున్నారు. అదే విధంగా పాలనకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయంలోని జగన్ భక్త అధికారులు తాము ఆడిందే ఆట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన స్థానాల్లో ఉన్న వీరిని ఏరివేయడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. అక్కడే కాదు..కీలమైన హెచ్ఓడిల్లోనూ అదే పరిస్థితి. ఇటువంటి హెచ్ఓడిల్లో ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్ర సమాచారశాఖ గురించి చెప్పుకోవచ్చు. గత ఐదేళ్లలో సమాచారశాఖలో తీవ్రమైన అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ అప్పటి కమీషనర్, అప్పట్లో కీలకంగా పనిచేసిన అధికారులపై విచారణ జరుపుతామని లీకులు ఇచ్చారు. కానీ..ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి చర్యలు మొదలు కాలేదు..దీంతో..తమను ఎవరూ ఏమీ చేయలేరని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచారశాఖ ఉద్యోగులు మీసాలు మెలేస్తున్నారు. చంద్రబాబు తమను ఏమీ చేయలేరని, తమపై చర్యలు తీసుకునే ధైర్యం ఆయనకు లేదని వారు వీరంగాలు వేస్తున్నారు. ఈ ఒక్కశాఖనే కాదు..దాదాపు అన్నిశాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడమే దీని కారణం. ప్రభుత్వ పెద్దలు మెతకవైఖరి ఇటువంటి వారికి కలసివస్తోంది. మెతకవైఖరిని విడనాడకపోతే..ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రావడానికి పెద్దగా సమయం పట్టదు.