సిఎంఓలో శాఖలు కేటాయింపు...!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో అధికారులకు శాఖలు కేటాంచారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పటి వరకూ నలుగురు ఐఏఎస్ అధికారులు కార్యాలయ అధికారులుగా చేరారు. ముందుగా సీనియర్ ఐఏఎస్ రవిచంద్రను తన ముఖ్యకార్యదర్శిగా చంద్రబాబు నియమించుకున్నారు. ఆ తరువాత వివాదాస్పద ఐఏఎస్ ప్రద్యుమ్నను తన కార్యాలయంలోకి తీసుకున్నారు. ఈ నిర్ణయంపై టిడిపి నాయకుల్లో, కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ప్రద్యుమ్న వైకాపాకు అనుకూలంగా పనిచేస్తారని, గతంలో ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు నిరసన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆయన భార్య వైకాపా లీగల్ సెల్‌లో పనిచేస్తున్నారని, అటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అధికారిని సిఎంఓలోకి ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు. అయితే వీరి ఆగ్రహాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. ఈయన తరువాత కార్తికేయ మిశ్రాను సిఎంఓలోకి తీసుకున్నారు. ఈయన నియామకం వెనుక విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. కార్తికేయ మిశ్రా లోకేష్ క్లాస్‌మేట్ అని, అందుకే ఆయనను కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు గతంలో చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన రాజమౌళిని డిప్యూటేషన్‌పై ఇక్కడకు మరోసారి తీసుకువచ్చారు. గతంలో చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన వారిలో ఇప్పుడు మళ్లీ పనిచేస్తోంది రాజమౌళి ఒక్కరే.
సామాజికవర్గాల లెక్కలేసుకుని చంద్రబాబు తన కార్యాలయంలో అధికారులను నియమించుకున్నారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీసీ, ఎస్టీ, బ్రాహ్మణ, కమ్మ వర్గాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. కాగా..తన కార్యాలయ అధికారులకు నేడు శాఖలను కేటాయించారు. కార్యాలయ ముఖ్యకార్యదర్శి రవిచంద్రకు జిఎడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, హోమ్, డిజాస్టర్‌మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్ మరియు శాసనసభా వ్యవహారాలు,రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియ స్టాంప్స్, ఎక్స్‌జ్, ఎండోమెంట్, లా అండ్ జస్టిస్, ఆరోగ్య, ఫ్యామిలీ, వెలెఫేర్, ముఖ్యమంత్రి కార్యాలయం, ఢిల్లీ, విదేశీపర్యటనలతోపాటు, ఇతరులకు కేటాయించని శాఖలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. రాజమౌళికి వాటర్‌రిసోర్స్, మైన్స్, ఎనర్జీ, వ్యవసాయం, కోపరేటివ్, సోషల్ వెల్ఫేర్, డైరీడెవలప్‌మెంట్, ఫిషరీష్,మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సిఎంఆర్ ఎప్, సిఎం గ్రీవెన్స్‌లు కేటాయించారు. ప్రద్యుమ్నకు హ్యూమన్ రిసోర్స్, రియల్‌టైమ్ గవర్ననెన్స్, మున్సిపల్ అడ్మిష్ర్టేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లయి, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పుడ్, సివిల్ సప్లయిస్ అండ్ కన్‌జ్యూమర్ ఎఫైర్, హౌసింగ్, వుమెన్ అండ్ చైల్డ్, ట్రైబల్ వెల్ఫేర్, పేదరిక నిర్మూలన, యూత్ అండ్ స్పోర్ట్స్‌లను కేటాయించారు. కార్తికేయ మిశ్రాకు ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎన్ ఆర్ ఐ ఎంపర్‌మెంట్ అండ్ రిలేషన్స్, సమాచారశాఖ, టూరిజం మరియు కల్చర్ అండ్, సినిమా, మౌళికవసతుల కల్పన, ఫుడ్ ప్రాసెస్, కామర్స్, ఎంఎస్ఎంఇ, కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ మరియు ఆర్ధికశాఖ, సిఎం ఢిల్లీ, విదేశీ పర్యటనల సమన్వయం తదితరశాఖలను ఆయనకు అప్పగించారు. మొత్తం మీద..సీనియర్ అధికారులైన రవిచంద్ర, రాజమౌళికి కీలకమైన బాధ్యతలను అప్పగించారు. వివాదాస్పద అధికారి అయిన ప్రద్యుమ్నకు కూడా కీలకశాఖలు దక్కాయి. చాలా రోజుల నుంచి సిఎంఓలో అధికారులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించలేదని, ఎప్పటికి అప్పగిస్తారనే దానిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు ఆయన వారికి శాఖలు కేటాయించారు.