పరార్ అయిన I&PR కమీషనర్‌కు పోస్టింగా..!?
ఆంధ్రా ప్రభుత్వం చోద్యం చూస్తోందా...?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఏ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇంకా మెతకవైఖరినే అవలంభిస్తోంది. గత ఐదేళ్ల జగన్ జమానాలో భారీ ఎత్తున్న అవినీతికి, అరాచకానికి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. వీరు మీన మేషాలు లెక్కించే సమయంలో అక్రమార్కులు ఇక్కడి నుంచి పరార్ అవుతున్నారు. అలా పరారయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. మద్యం కుంభకోణంలో కీలకమైన వాసుదేవరెడ్డి ఇప్పటికే పరార్ కాగా, సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి నుండి పరార్ అయ్యారు. తన అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందనే భావనతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఢిల్లీలో రిపోర్టు చేశారు. దీనిపై అప్పట్లో మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయనకు అక్కడ పోస్టింగ్ రాకుండా అడ్డుకుంది. ఈలోపు ఆయన అవినీతిపై, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతున్నామని లీకులు ఇచ్చింది. ఈ విచారణ ఏమయిందో..ఏమో కానీ..ఇప్పుడు విజయ్‌కుమార్‌రెడ్డి మళ్లీ కేంద్రంలో పైరవీలు చేసుకుని కొలకోతాలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. నిన్న ఆయనకు పోస్టింగ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి.కాగా సమాచారశాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సభాసంఘం చేత విచారణ చేయిస్తామని నేడు అసెంబ్లీలో సంబంధితశాఖ మంత్రి పార్ధసారథి ప్రకటించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, వారిని రిలీవ్ చేయమని చెప్పారు. అయితే..ప్రభుత్వం చర్యలు తీసుకునే లోపల అక్రమాలకు పాల్పడిన విజయ్‌కుమార్‌రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి పోస్టింగ్ తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలా జరిగిందని పలుజర్నలిస్టు సంఘాలు అంటున్నాయి.
జగన్ ప్రభుత్వం ఓడిపోయిన దగ్గర నుంచి సమాచారశాఖ కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి బాధ్యతగా వ్యవహరించలేదు. ఈ ప్రభుత్వం నన్నేమీ చేయలేదు..నన్నేమి పీకుతారు..అన్నట్లు ఆయన వ్యవహరించారు. తాను నిర్వహిస్తున్న బాధ్యతలను వేరేవారికి అప్పగించకుండా పరార్ అయ్యారు. కనీస మర్యాద కూడా పాటించని ఇటువంటి అధికారులు కేంద్రంలో పోస్టింగ్‌లు తెచ్చుకుంటుంటే..రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందనే ప్రశ్న పలు వర్గాల నుంచి వస్తోంది. కేంద్రంలోని డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే..ఆయనపై విచారణను వెంటనే చేయించి ఉంటే..ఆయనకు ఇప్పుడు పోస్టింగ్ వచ్చేది కాదు. విజిలెన్స్ విచారణ అంటూ చెప్పటమే కానీ, దానిపై కనీసం ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. దీంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు దర్జాగా ఇక్కడ నుంచి కాలరెగెరేసి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వంలో ఇంతటి నిర్లిప్తత ఎందుకో..తెలియడం లేదు..వాళ్ల పాపాన వాళ్లే పోతారనే ఉదాసీనత లేక భయాలో..తెలియడం లేదు...? సమాచారశాఖను జగన్‌కు దోచిపెట్టిన విజయ్‌కుమార్‌రెడ్డిపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సమాచారశాఖకు ఫిర్యాదు చేసి, ఆయన పోస్టింగ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.