అందరి చూపు..సుప్రీం వైపే...!
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లలో అలజడి సృష్టించింది. ఆయన అరెస్టే ఒక సంచలనం అనుకుంటుంటే..దాదాపు ఆయన 24రోజుల పాటు జైలులో ఉండడం మరింత సంచలనం. చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఆయన ఎటువంటి అవినీతికి పాల్పడలేదని టిడిపి నాయకులతోపాటు, మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. ఆధారాలు లేని కేసులో చంద్రబాబును బంధించారని, ఆయన అరెస్టు అక్రమమని వారు ఆక్రోశిస్తున్నారు. అయితే..టిడిపి చేస్తోన్న వాదనలను అధికారపక్షం తిప్పికొడుతోంది. ఆయన అవినీతికి పాల్పడ్డారని, అందుకే కిందస్థాయి కోర్టులు ఆయనను విడుదల చేయలేదంటూ చెబుతున్నాయి. అయితే..తనపై పెట్టిన కేసు అక్రమమని, దాన్ని కొట్టివేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టును, అనంతరం హైకోర్టును కోరారు. అయితే ఆయన వాదనను ఈ కోర్టులు పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విచారణకు వచ్చినా న్యాయమూర్తి భట్టి నాట్ బిఫోర్ మీ అని అనడంతో కేసు నాటకీయ పరిణామాల మధ్య 3వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఇప్పుడు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చంద్రబాబు అభిమానులు రేపు అయినా ఆయనకు ఊరట లభిస్తుందేమోనన్న ఆశతో ఉన్నారు.
రేపు ఉదయం జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేల త్రివేది బెంచ్ ముందుకు చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు రానుంది. దిగువ న్యాయస్థానాలు క్వాష్‌ను కొట్టివేయడానికి నిరాకరించడంతో ఇప్పుడు ఈ కేసు దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఆయనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్టు చేయడం సరైనదేనా..? అనే అంశంపై రేపు ప్రధానంగా చర్చ సాగుతోంది. దిగువ కోర్టులు చంద్రబాబు అవినీతికి ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లు నమ్మడంతోనే ఆయన కేసును క్వాష్ చేయలేదని వైకాపా నాయకులు ఊదరగొడుతున్నారు. దిగువ న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తుందా..?అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబుకు కానీ, ఆయన కుటుంబసభ్యులకు కానీ నేరుగా సొమ్ములు ముట్టినట్లు సీఐడీ ఆధారాలు చూపించడం లేదు. విచారణలో ఆధారాలు చూపుతామని చెబుతున్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి ఈ కేసును విచారిస్తోన్న సీఐడీ ఇప్పుడు చంద్రబాబు అవినీతిని ఇంకా విచారించి ఆధారాలు సేకరిస్తామని చెప్పడంపై సుప్రీం ఏమంటుందో చూడాలి. చంద్రబాబు నేరం చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు సీఐడీ చూపకపోవడం, నిధులు విడుదల చేసిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, కొందరినే ఈ కేసులో విచారించడం వంటి అంశాలను సుప్రీం ఏ విధంగా పరిగణిస్తుందో లేదో చూడాలి. కాగా ఈ కేసులో తమ వాదన విని తీర్పు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరితే క్వాష్ పిటీషన్ విచారణ మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.కేసు విచారణ మరింత జాప్యం అయితే..టిడిపికి ఇబ్బందులు మరింత పెరగవచ్చు. కాగా..ఈ కేసులో ఏమి జరుగుతుందోనన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అదే విధంగా 17ఏపై కూడా విస్తృతంగా దేశ వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉంది.