అధికారులు సహకరించడం లేదా...!?
రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తున్నా..అధికార కూటమికి పాలనపై ఇంకా పట్టురాలేదు. అపార పాలనానుభం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార వ్యవస్థను గాడిన పెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తోన్నా..కొందరు అధికారుల నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. పాలనకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయంలో ఇంకా జగన్ భక్తుల హవానే నడుస్తోంది. సచివాలయంతోపాటు పలుశాఖలకు చెందిన హెచ్ ఓడీల్లో వైకాపా సానుభూతిపరులు పెత్తనం చెలాయిస్తున్నారు. అయితే..కొందరు హెచ్ ఓడీలను బదిలీ చేసినా..ఇంకా కింది స్థాయిలోని జగన్ అభిమానులు తమ పెత్తనం నిలబెట్టుకునేందుకు అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. గత జగన్ పాలనలో అంతా తామై వ్యవహారాలు నడిపిన ఈ క్రింది స్థాయి అధికారులు ఇప్పుడు తమ తమ స్థాయిల్లో అక్కడే కొనసాగేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. తమను అక్కడే కొనసాగిస్తే..వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తామని బేరసారాలు చేసుకుంటున్నారు. బేరాలు కుదిరిన చోట అధికారపార్టీ నేతలు జగన్ భక్తులనే కొనసాగిస్తున్నారు. దీంతో..పాలనపై అధికార కూటమికి పట్టుచిక్కడం లేదు. మెజార్టీ శాఖల్లో డిపార్ట్‌మెంట్ అధినేతలను మార్చినా..కింది స్థాయి అధికారులు సహకరించకపోవడంతో..ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాను శాఖల హెడ్‌లను మార్చను కనుక..అంతా సర్దుకుంటుందనే భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కింది స్థాయిలో మార్పులు చేర్పులు ఆయా శాఖాధిపతులు చేసుకుంటారని, ఆయన వారికి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే..ఈ శాఖాధిపతులు మాత్రం తమకెందుకులే అన్నభావనతో వివిధ శాఖల్లో కింది స్థాయి అధికారులను అదే బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. దీంతో జగన్ భక్తులు తమను ఎవరూ ఏమీ చేయలేరని, అడ్డూ అదుపూ లేకుండా తప్పులు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తోంది. పాలనపై ఇంకా పట్టురాకపోవడానికి ఇదో కారణంగా చెప్పవచ్చు. మొత్తం మీద..వివిధ శాఖల్లో కీలకమైన పోస్టుల్లో ఉన్న జగన్ భక్తులను త్వరగా ఇంటికి పంపడమో..లేక.. సెలవుపై పంపడమో చేస్తే కానీ..పాలనలో మార్పురాదనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.