‘చెవిరెడ్డి’కి అంత మర్యాద అవసరమా..!?
హత్యానేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఒక హత్యాకేసులో నిందితుడైన వ్యక్తి పట్ల పోలీసులు అంత మర్యాదగా వ్యవహరించడంపై వారు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన విధానాన్ని వారు గుర్తు చేసుకుని మండిపడుతున్నారు. తమ పార్టీ నేత, ప్రస్తుత మంత్రి అచ్చెంనాయుడు శస్త్రచికిత్స చేయించుకున్నా వదలకుండా, శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ రోడ్డు మార్గాన తరలించారని, ఈ క్రమంలో ఆయనకు తీవ్ర రక్తస్రావమైనా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం మాత్రం వైకాపా వారి పట్ల ఎనలేని మర్యాదలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అచ్చెంనాయుడే కాదు, కొల్లు రవీంద్ర, దూళ్లిపాళ్ల నరేంద్ర, ప్రస్తుత స్పీకర్ అయ్యనపాత్రుడు, పట్టాభి ఇలా మరెందరో నేతలపై తప్పుడు కేసులు మోపి, అర్థరాత్రిపూట అరెస్టు చేసి జైళ్లకు పంపించారని, తమ ప్రభుత్వం మాత్రం హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తికి కేవలం నోటీసులు ఇచ్చి పంపించారని, ఇలా అయితే..టిడిపి నేతలు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి జగన్ వేధించారని, కానీ తాము వాస్తవకేసుల విషయంలో కూడా వారిని ఇబ్బంది పెట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామేమీ వారిపై తప్పుడు కేసులు పెట్టమని కోరడం లేదని, వారు చేసిన అన్యాయాలకు శిక్ష వేయమనే కోరుతున్నామని, కానీ తమ ప్రభుత్వం మాత్రం వైకాపా నాయకుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందని, ఇది సరికాదని వారు అంటున్నారు. చంద్రగిరిలో టిడిపి ఎమ్మెల్యేపై చేసిన దాడి సాధారణ దాడి కాదని, ఆరోజు పులవర్తి నానిని చంపేందుకే చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రయత్నించారని, అటువంటి కరుడుకట్టిన నేరస్తులను నోటీసులతో సరిపుచ్చడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఇంత కన్నా ఏమీ చేయరనే భావన జగన్ భక్తుల్లో నాటుకుంటుందని, ఇలా అయితే..రాబోయే ఐదేళ్లలో జగన్ నుంచి పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని వారు అంటున్నారు.