అవినీతి, అనైతిక సంబంధాలు..ఆ ఉన్నతాధికారి ప్రత్యేకత...!
జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన పాలెగాళ్లు కొందరు అడ్డూ..అదుపూ లేకుండా రెచ్చిపోయారు. తమ నేత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారని, ఇక అధికారం మనదేనని, దేశంలో ఎక్కడెక్కడో..ఉన్న అధికారులందరూ..ఆంధ్రాకు వచ్చేశారు. డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి దిగబడ్డ వీరికి జగన్ కీలకమైన పోస్టులు కట్టబెట్టారు. ఈ కీలకపోస్టుల్లో కొలువుతీరిన సదరు జగన్ సామాజికవర్గ అధికారులు చేసిందేమిటంటే..అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకోవడం..దోచుకున్నదానిలో జగన్‌కు సగం కప్పం కట్టడం..మిగతాది వెనుకేసుకోవడం చేశారు. దాదాపు పది మంది దాకా..ఈ విధంగా జగన్‌కు దోచిపెట్టినవారి లిస్టు ఇప్పటి వరకూ బయటకు వచ్చింది. ప్రజాధనాన్ని దోచుకోవడంతోనే..వీరి ఆగడాలు ఆగలేదు. తమకు దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ వద్ద పనిచేసే పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే వార్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. రాష్ట్రానికి డిప్యూటేషన్‌పై వచ్చిన సదరు అధికారులు తమ కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులను వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సదరు మహిళలు ఫిర్యాదులు చేయకపోయినా..ఆయా సంస్ధల్లో పనిచేసే ఇతర ఉద్యోగులు ఇప్పుడు వీరి భాగోతాలను బయటపెడుతున్నారు. ఇలా మహిళలను వేధించిన వారిలో ప్రజలతో సన్నిహితంగా ఉండే శాఖకు సంబంధించిన అధికారి ఉన్నారని, ఆయన రాసలీలు అన్నీఇన్నీకావని సదరు సంస్థలో పనిచేసిన ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారంతో పాటు, అడ్డగోలు సంపాదన ఉన్న ఈ అధికారి రోజుకో మహిళను వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎన్‌డిఏ ప్రభుత్వం విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పటిదాకా సదరు అధికారిపై కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అయితే ఇప్పుడు మహిళలను లోబరుచుకున్నారనే వార్తలు వస్తున్నాయి. శాఖాపరమైన పర్యటనలకు వెళ్లినప్పుడు మహిళా ఉద్యోగులను వేధించారని, అదే విధంగా తన కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులతో పనిలేకున్నా..వారితో చనువు పెంచుకోవడానికి తన అధికారాన్ని వినియోగించారని, తన పరపతిని ఉపయోగించి వారిని లోబరుచుకోవడానికి యత్నించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కార్యాలయాన్ని స్వంత ఇంటిలా వాడుకున్నారని, పలువురు ఉద్యోగులు ఆయన కోసం వారి ఇంటి నుంచి పసందైన మాంసాహార వంటకాలను తెచ్చి తినిపించారని, అలా తెచ్చిన ఉద్యోగులకు సదరు అధికారి ప్రాధాన్యతా పోస్టులు ఇచ్చి ప్రోత్సహించారట. ఇలా చేసినందుకు ఎక్కడో పనిచేయాల్సిన సదురు ఉద్యోగిని తన కార్యాలయంలో నియమించుకున్నారట. మొత్తం మీద సదరు ఉన్నతాధికారి అటు అవినీతితో పాటు ఇటు అనైతిక సంబంధాలను నెరపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్‌డిఏ ప్రభుత్వం దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.