మళ్లీ కంభంపాటికేనా...!?
నామినేటెడ్ పదవుల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు పంపిణీ చేయలేదని నాయకులు, కార్యకర్తలు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు పూర్తి అవుతున్నా..కొంతమందికైనా పదవులు ఇవ్వకపోవడంపై పార్టీలో ఒకరకమై నిరాశ, అసంతృప్తి వ్యక్తం అవుతోంది. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని, ముఖ్యమంత్రి ప్రకటించి తరువాత ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న వారు కొంత స్థిమిత పడ్డారు. కాగా పలువురు పలురకాలుగా నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి కోసం పలువురి పేర్లను అధినేత చంద్రబాబు పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ముందుగా మాజీ రాజ్యసభ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌రావు పేరు ఈ పదవి కోసం ముందు వరసలో ఉందని ప్రచారం సాగుతోంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరోసారి తనకు ఆ పదవిని అధినేత చంద్రబాబు ఇస్తారని ఆశిస్తున్నారు. దీని కోసం ఆయన తన ప్రయత్నాలను తాను చేసుకుంటున్నారు. అయితే..గతంలో ఆయనకు పదవి ఇచ్చారని, అప్పట్లో పార్టీ కోసం ఆయన సమర్థవంతంగా పనిచేయలేదని, ఈసారి ఆయనకు ఆ పదవి ఇవ్వవద్దని, మరో పార్టీ నేతను ఆ పదవికి ఎంపిక చేయాలని పార్టీలో కొందరు నేతలు కోరుతున్నారు. గతంలో బిజెపి, టిడిపి మధ్య సమన్వయం లోపించిందని, ఢిల్లీ పరిణామాలను అధినేతకు సరిగా ఆయన చెప్పలేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఢిల్లీలో అధికారప్రతినిధిగా ఉన్న వ్యక్తి అక్కడి పరిణామాలతో పాటు, జగన్, విజయసాయిరెడ్డి ఎత్తుగడలను పసిగట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. వారిద్దరూ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షాలను పదే పదే కలుస్తూ బిజెపి, టిడిపిలను విడదీయడంలో సక్సెస్ అయ్యారని, వారి యత్నాలను చంద్రబాబుకు వివరించడంలో కంభంపాటి విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈసారి ఆయనకు ఇవ్వవద్దని మరో నేతకు ఆ పదవిని ఇవ్వాలని పార్టీ శ్రేయస్సు కోరుకునే నేతలు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే..టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపి గల్లా జయదేవ్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి కూడా అధికారప్రతినిధి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సుజనాచౌదరి బిజెపి తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టిడిపిలోనే ఉన్నారు. ఈయన అయితే..ఇరు పార్టీలను సమన్వయం చేసుకుంటారని, ఢిల్లీలో పరిచయాలు కూడా ఎక్కువ ఉన్నాయనే భావన కొందరిలో ఉంది. ఈ రకంగా చూసుకుంటే సుజనాకు అవకాశాలు ఉంటాయి. ఇక రఘురామకృష్ణంరాజు వ్యవహారం వేరే ఉంటుంది. ఆయనకు కూడా ఢిల్లీలో పరిచయాలు విస్తృతంగానే ఉన్నాయి. అయితే..ఆయన వ్యవహారశైలిని తట్టుకోవడం పార్టీకి కష్టమే. కనుక ఆయనకు అవకాశం లభించడం కష్టమే. ఇక ముక్కుసూటిగా వ్యవహరించే గల్లా జయదేవ్ కూడా అవకాశాలు తక్కువే. వీరు కాకుండా మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కూడా రేసులో ఉన్నారు. ఈయన పేరునూ పరిశీలించే అవకాశం ఉంది.