‘శుక్లా’కు అదనపు బాధ్యతలు..ఇక పనిలో పడతారా...!?
రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్ష్ శుక్లాకు ప్రభుత్వం ఎపి డిజిటల్ మీడియా ఎండిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులను విడుదల చేసింది. అంతే కాకుండా ఆయనను రాష్ట్ర సమాచారశాఖకు Ex Officio Joint Secretaryగా నియమించింది. ఇటీవలే ఆయనను సమాచారశాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. గతంలో సమాచారశాఖ కమీషనర్‌గా ఉన్న విజయ్‌కుమార్‌రెడ్డి పరార్ అవడంతో ఆయన స్థానంలో శుక్లాను ప్రభుత్వం నియమించింది. అయితే..శుక్లాను తాత్కాలికంగానే సమాచారశాఖలో నియమించారని, త్వరలోనే ఆయనను బదిలీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో సమాచారశాఖ డైరెక్టర్‌గా ఉన్న శుక్లా శాఖ విషయంలో పెద్దగా దృష్టిసారించలేదనే భావన వ్యక్తం అయింది. నూతనంగా సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమితులైన అధికారి తన శాఖ అధికారులతో కనీసం సమీక్ష నిర్వహించలేదు. ఫీల్డ్ లో ఉన్న అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించలేదు. ఆయన నియామకం అయిన తరువాత నుంచి ఎటువంటి మేజర్ నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం దస్త్రాలను ఈ ఆఫీస్ ద్వారానే పంపించాలని, అలా అయితే దస్త్రాలు ముందుకు కదులుతాయని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ పత్రికల్లో వచ్చే వార్తల విషయంలో ఐఏ స్టాప్‌వేర్‌ను ఉపయోగించి అనుకూల, వ్యతిరేకవార్తలను ప్రభుత్వానికి నివేదించారు. అంతకు మించి నిర్ణయాత్మకమైన విషయాలపై ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.
అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయా...?
గత ప్రభుత్వ హయాంలో శాఖలో భారీగా జరిగిన అవినీతి, అనైతిక కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించలేదు. విజయ్‌కుమార్‌రెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..అది ఎంత వరకు వచ్చిందో..ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉంటే..గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన సీనియర్ అధికారులు ఇంకా తమ స్థానాలను వీడలేదు. వీరంతా యధావిధిగా తమ పనులు తాము చేసుకుంటున్నారు. తమను ఎవరూ ఏమీ పీకలేరనే ధీమాతో వారు ఉన్నారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారులు డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ ప్రాపకం కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నసదరు అధికారులు పవన్ కళ్యాణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ..తాము కూడా పవన్ అభిమానులమని, తమ అవినీతిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే..గత ప్రభుత్వ హయాంలో సమాచారశాఖను శాసించిన ఓ అధికారి ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిబ్బందితో సమావేశం అవుతున్నారు. సమాచారశాఖలో పనిచేయాల్సిన ఈ అధికారి సిఎంఓలో ప్రత్యక్షం అవుతున్నారు. సిఎంఓ పిఆర్ ఓ అవుతారని భావిస్తోన్న ఒక టీవీ మాజీ జర్నలిస్టుతో ఈ అధికారి ఇష్టాగోష్టిలు నిర్వహిస్తున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సదరు అధికారి ఆయనతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా శుక్లా కొనసాగుతారని ఈ రోజుతో తేలిపోయిందని, ఆయన ఇకపై శాఖపై సత్వరం నిర్ణయాలు తీసుకుంటారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తారనే అభిప్రాయాలు జర్నలిస్టు సంఘాల్లో వ్యక్తం అవుతోంది.