I&PR సీనియర్ అధికారులపై బదిలీ వేటు...!?
రాష్ట్ర సమాచారశాఖలో పనిచేస్తోన్న కొందరు సీనియర్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయబోతోంది. గత జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చెలరేగి అవినీతికి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సీనియర్ అధికారులు నలుగురిని ప్రభుత్వం బదిలీ చేయబోతోంది. వీరిలో కొందరిపై సస్పెండ్ వేటు పడినా ఆశ్చర్యం లేదు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర సమాచారశాఖను వైకాపా కార్యాలయంగా మార్చివేశారనే విమర్శలు వీరిపై ఉన్నాయి. రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడి నుండి పరార్ అయ్యారు. తనను టిడిపి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయిస్తుందనే భయంతో ఆయన చెప్పాపెట్టకుండా ఢిల్లీకి పరార్ అయ్యారు. అయితే..ఆయనను వెనుక్కు తెస్తామని, ఆయన అక్రమాలపై విచారణ చేయిస్తామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అసెంబ్లీలో సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన అయితే హామీ ఇచ్చారు..కానీ దానిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో..ఎవరికీ తెలియదు. అయితే..గత జగన్ ప్రభుత్వంలో విజయ్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు, అవినీతికి సహకరించిన పలువురు సీనియర్ అధికారులపై ప్రభుత్వంవేటు వేయబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శాఖలో ఏమి జరిగిందో అన్నదానిపై అంతర్గత విచారణ చేయించుకుంది. ఈ విచారణలో అప్పటి కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు మరి కొందరు సీనియర్ అధికారులు తీవ్రస్థాయిలో అవినీతి, అక్రమాలకు, నిబంధనలకు తూట్లు పొడిచారనే విషయం బయటకు వచ్చింది. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని ఇటీవలే సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమితులైన హిమాన్ష్ శుక్లాను ఆదేశించింది. వాస్తవానికి వీరిపై మొదట్లోనే చర్యలు తీసుకోవాలని భావించినా..అంతర్గత విచారణ తరువాత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. దీంతో వీరిపై చర్య తీసుకోవడం ఆలస్యం అయింది. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలపడంతో..సమాచారశాఖ సీనియర్ ఉద్యోగులపై కూడా బదిలీ వేటు పడబోతోంది. ఇలా బదిలీ వేటు పడబోయే వారిలో గత ఐదేళ్ల పాటు సమాచారశాఖను గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించిన అధికారి ఒకరు ఉన్నారు. ఈ అధికారిపై కేవలం బదిలీ వేటు మాత్రమే చాలదనుకుంటే.. అంతకంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే ఆ అధికారిపై సస్పెండ్ వేటు పడుతుంది. లేదా సెలవుపై వెళ్లమనే అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పట్లో విజయ్‌కుమార్‌రెడ్డికి సహకరించిన ఇంజనీరింగ్ సెక్షన్ లోని అధికారిపై కూడా బదిలీ వేటు ఉంటుంది. వీరు కాకుండా విజయ్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు సహకరించిన మరికొందరు అధికారులను కూడా బదిలీ చేయనున్నారు. ఇక ఎక్కడో పనిచేయాల్సిన కొందరు అధికారులు అప్పటి కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిని వివిధ రకాలుగా మచ్చిక చేసుకుని I&PRలో తిష్టవేశారు. వీరిపై కూడా బదిలీ వేటు పడనుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా ఊపడంతో..I&PR అవినీతి ఉద్యోగులను కూడా ఇక్కడ నుండి సాగనంపబోతున్నారు.