అనుకున్నది సాధించిన మీడియా ఫ్యానలిస్టు...!?
ఆయనో సాధారణ జర్నలిస్టు. గతంలో కొన్ని పత్రికల్లో పనిచేశారు. తరువాత ఏదో వార్తా పత్రిక పెట్టుకుని నడుపుకుంటూ ఉన్నారు. గత జగన్ ఐదేళ్ల పాలనపై టిడిపికి మద్దుతుగా నిలిచే ఓ టీవీ ఛానెల్‌లో ఈయనగారు విశ్లేషకుడిగా వెళ్లారు. టిడిపిని గట్టిగా సమర్ధించి, జగన్‌పై విమర్శలు గుప్పించేవారు. అలా ఒక స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ గుర్తింపుతో పైరవీలు చేస్తున్నారనే విమర్శ వస్తోంది. ఇప్పడు..ఆయన అధికారుల ట్రాన్స్‌ఫర్స్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకూ లాబీయింగ్ చేస్తున్నారని సచివాలయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన తలచుకుంటే..తెలంగాణ వారికైనా పోస్టింగ్ ఇప్పించగలరట. అలానే..ఇప్పుడో సీనియర్ మంత్రి పేషీలో తెలంగాణ ఉద్యోగికి స్థానం కల్పించారట సదరు జర్నలిస్టు. కేవలం పోస్టింగ్ ఇప్పించడమే కాదు..ఆయన చేత దగ్గరుండీ మరీ పనిచేయిస్తున్నారు. ఏ ఫైలు ఎలా రాయాలి..ఎవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేయాలి..? ఎవరికి ఏవిధంగా సమాధానం చెప్పాలనేది..అంతా ఇతగాడి కనుసన్నల్లోనే జరుగుతుందట. సదరు జర్నలిస్టు ఇదంతా చేస్తుంటే..మంత్రిగారు..ఏమి చేస్తున్నారో...? అనే ప్రశ్న వస్తుంది కదా..అయితే సదరు మంత్రికి పెద్ద మనిషి అనే పేరు ఉంది. ఎవరినీ అంత త్వరగా నొప్పించరట. పైగా..ఎన్నికల సమయంలో సదరు జర్నలిస్టు..మంత్రిగారి ఎన్నికల ప్రచారానికి వెళ్లారట..ప్రచారం ఏమీ ఊరికే చేయలేదట...? బాగానే సదరు ప్యానలిస్టుకు ముట్టిందట. ఎన్నికల్లో తన ప్రచారానికి ఉపయోగపడ్డారు..కదా..అనే కృతజ్ఙతతో..ఆయన ఈయనను ఏమీ అనడం లేదట. పైగా..తన సామాజికవర్గానికి చెందిన అధికారులను ఏరి కోరి తన శాఖలో నియమించడంలో..సదరు ప్యానలిస్టు మంత్రికి సహాయం చేస్తున్నారట. దీంతో..తనకు ఎంతో మేలు చేస్తోన్న సదరు ప్యానలిస్టును..ఏమీ అనడం లేదనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు వరకూ జగన్‌పార్టీలో ఉండి తరువాత టిడిపిలోకి వచ్చిన సదరు మంత్రికి మంచివాడనే పేరు ఉంది. తనకు నమ్మకంగా పనిచేసే వ్యక్తి కోసం ఆయన తెలంగాణకు చెందిన సదరు అధికారి కోసం సిఎం చంద్రబాబుతో ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారట. అయితే..ఇదంతా సదరు ప్యానిలిస్టు ముందస్తు వ్యూహమేనని ప్రచారం సాగుతోంది. తెలంగాణ అధికారిని ఇక్కడకు తేవవాని తెర వెనుక సదరు ప్యానిలిస్టు పావులు కదిపారు. ఆయన పాచికలు ఫలించాయి. దీంతో ..ఇప్పుడు ఆ మంత్రి పేషీలో ఈ ప్యానిలిస్టు చక్రం తిప్పుతున్నారట. చక్రం తిప్పితే తిప్పారు..మంత్రికి చెడ్డపేరు తేవద్దని..గతంలో ఈ సీనియర్ మంత్రి వద్ద పనిచేసిన అంతరంగిక సిబ్బంది జనాంతికంగా అంటున్నారు.