ఫలించిన ఉత్తరాంధ్ర ఎంపి లాబీయింగ్...!?
పోలవరం ప్రాజెక్టు పనులను చేస్తోన్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ కోసం ఉత్తరాంధ్ర ఎంపి ఒకరు చేసిన లాబీయింగ్ ఫలించింది. ఆయన ఆశించిన విధంగానే మెఘా ఇంజనీరింగ్ సంస్థకు డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. (మెఘాను కొనసాగిస్తారని Janamonline.com గతంలోనే చెప్పింది) (https://www.janamonline.com/article?nid=160) మెఘానే పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తోంది. వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ పోలవరం పనులు చేస్తోన్న నవయుగ సంస్థను పక్కకు తప్పించి, రివర్స్ టెండరింగ్ పేరిట మెఘా ను రంగంలోకి తెచ్చారు. అయితే..మెఘా పోలవరం పనులు చేపట్టిన తరువాత కేవలం 4శాతం పనులను మాత్రమే చేసింది. 2019 నుంచి పోలవరం పనులను ఆగమేఘాలపై చేసి, దాదాపు 70శాతం పనులను పూర్తి చేసిన నవయుగను కాదని జగన్ తన సామాజికవర్గానికి చెందిన మెఘాకు పోలవరం ప్రాజెక్టు పనులను అప్పగించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా..జగన్ ఖాతరు చేయలేదు. మెఘా అలసత్వం వల్ల 2019-22ల్లో వచ్చిన వరదల వల్ల డయాఫ్రంవాల్ దెబ్బతింది. దీంతో మళ్లీ డయాఫ్రంవాల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం వచ్చింది. పోలవరం పనుల్లో మెఘా అలసత్వం, అసమర్థత, అప్పటి ప్రభుత్వ పెద్దల బాధ్యతారాహిత్యం వల్ల పోలవరం డ్యామ్‌నిర్మాణం ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెఘాను తప్పించి గతంలో వేగంగా పనులు చేసిన నవయుగను రంగంలోకి దించాలని భావించింది. అయితే..ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపి మెఘా తరుపున కేంద్రంలో లాబీయింగ్ చేశారనే వార్తలు వస్తున్నాయి. టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన ఈ ఎంపి మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. కూటమిప్రభుత్వం ఏర్పడిన తరువాత మెఘా అధినేతను చంద్రబాబు వద్దకు ఈయన తీసుకెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిలో ఎంత నిజం ఉందో కానీ, కేంద్రంలో మాత్రం ఈ ఎంపి పలకుబడిని ఉపయోగించి ఇప్పుడు మెఘాను పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా కొనసాగేందుకు లాబీయింగ్ చేశారని, ఆయన లాబీయింగ్‌ఫలించిందనే వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు, గతంలో కుదిరిన రేట్లకే పనులు చేస్తామని ముందుకు వచ్చినందుకే..మెఘాను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే..వాస్తవం అది కాదని, మెఘా తరుపున లాబీయింగ్ పెద్ద ఎత్తున కేంద్రంలో జరిగిందని, అందుకే వారిని కొనసాగిస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఏది ఏమైనా..కాంట్రాక్టు ఎవరికి అప్పగించినా..ఆలస్యం కాకుండా పోలవరం పూర్తి కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.