వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారుః లోకేష్
తన తండ్రి చంద్రబాబునాయుడు ఎటువంటి తప్పులు చేయకపోయినా, వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమంగా నిర్భంధించారని టిడిపి ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు. ఈ రోజు ఆయన చంద్రబాబునాయుడిని జైలులో కలిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరంలో జరిగిన అక్రమాల గురించి ప్రశ్నించినందునే చంద్రబాబును జైలులో పెట్టారని, ఆయన అక్రమ అరెస్టుపై తాము పోరాడుతామని, తమకు ఎటువంటి భయం లేదని, అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపినందుకు, ప్రజలను చైతన్యవంతం చేసినందుకే అక్రమకేసులను బనాయిస్తున్నారని, వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పుడు కేసుల్లో చంద్రబాబును జైలుకుపంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపించారని, తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయం జరిగేందుకు సమయం పట్టినా..అంతిమ విజయం ధర్మానిదేనని, ధర్మం తమవైపే ఉందని ఆయన అన్నారు. రిమాండ్‌లో ఉన్న తన తండ్రి ధైర్యాన్ని కోల్పోలేదని, న్యాయపరంగా పోరాడదామని, శాంతియుతంగా పోరాడాలని తమ నాయకుడు తమతో చెప్పారని ఆయన తెలిపారు. చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉందని, కొందరు జైలుపై దాడి చేస్తామని బెదిరిస్తున్నారని, కొందరు జైలుపై నుంచి డ్రోన్‌లు ఎగురవేస్తున్నారని, ఇవన్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆయన అన్నారు.