బోగస్ పెన్షన్ల ఏరివేతపై...సాక్షి యాగీని పట్టించుకోవాలా...!?
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడానికి జగన్ మీడియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజధాని అమరావతి, పోలవరం, అంబేద్కర్‌విగ్రహం, అమ్మకువందనం, అన్నక్యాంటీన్లు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పోస్టింగ్, 36 మంది వైకాపా కార్యకర్తల హత్య అంటూ..ఒకటేమిటి...? ఏది దొరికితే..దానిపై విషం చిమ్మడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే..జగన్ మీడియా, సోషల్ మీడియా చేసే ప్రచారాన్ని మెజార్టీ ప్రజలు నమ్మడం లేదు. అయితే..పదే పదే అసత్యాలను, అర్థసత్యాలను ప్రచారం చేస్తూ..ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోంది. తాజాగా నేడు పెన్షన్లను పీకేస్తున్నారంటూ ప్రచారం మొదలుపెట్టింది. బోగస్ పేరిట పెన్షన్లును చంద్రబాబు కోసేస్తున్నారంటూ.. మొదటి పేజీలో ప్రముఖంగా వార్తను ప్రచురించింది. సాక్షి బాటలోనే వైకాపా సోషల్‌మీడియా పెన్షన్లను పీకేస్తున్నారంటూ..పెడబొబ్బలు పెడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం బోగస్ పెన్షన్లపై సమాచారాన్ని మాత్రమే సేకరిస్తోంది. ముఖ్యంగా వికలాంగుల పేరిట విడుదల అవుతోన్న పెన్షన్లలో అనర్హులు భారీ స్థాయిలో ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు వికలాంగులమంటూ ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు పొంది..భారీగా ఫించన్లు తీసుకున్నారు. వీరి అర్హతలపై ప్రభుత్వం విచారిస్తోంది. వీరు నిజంగానే వికలాంగులా..? లేక ప్రభుత్వ హాస్పటల్స్ నుంచి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని పెన్షన్ పొందుతున్నారా..? అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను విచారించమని ఆదేశించారు. దీన్ని పట్టుకుని జగన్ మీడియా వీరంగాలు వేస్తోంది. అర్హత లేకపోతే..ఎలా పెన్షన్ పొందుతారు...? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించకుండా ఇష్టారీతిన గత ప్రభుత్వం తమ కార్యకర్తలకు పెన్షన్లు మంజూరు చేసింది. సోషల్ ఆడిట్ లేకుండానే ఈ పెన్షన్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నియమించబడ్డ వాలంటీర్లు వైకాపా కార్యకర్తలకు, నాయకులకు భారీగా వికలాంగ ఫించన్ల మంజూరులో తమ వంతు పాత్రపోషించారు. వైకాపాకు చెందిన వారు అయితే..వాలంటీర్లు దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ఫించన్లు మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపైనే విచారణ చేయిస్తోంది. అయితే..ప్రజలకు ఇచ్చే ఫించన్లు భారీగా కోతేస్తున్నారంటూ సాక్షి, దాని అనుబంధ మీడియా సంస్థలు భారీ స్థాయిలో ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.