జగన్‌కు సీబీఐ భయం...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ భయం పట్టుకున్నట్లుంది. తన ఐదేళ్ల పాలనాకాలంలో చేసిన పాపాలు..ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం బయటకు తీస్తుండడంతో..తనను ఎక్కడ అరెస్టు చేస్తారేమోనన్న బెంగ ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. లిక్కర్, ఇసుక, ఐ&పిఆర్, డిజిటల్ కార్పొరేషన్, రెవిన్యూ, రాజధాని భూములు ఒకటేమిటి...గత ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలను దోచేసిన జగన్ అండ్ కోపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. అవినీతికి పాల్పడిన కీలక అధికారులను గుర్తించి అరెస్టులు చేస్తోంది. వారిచేత దీని వెనుక ఉన్న అసలైన దోపిడీదారుని గుర్తించే పనిని చేపట్టింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌లో కీలకమైన వాసుదేవరెడ్డి దొరకడంతో..ఈస్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది. లిక్కర్‌లో జరిగిన స్కామ్ వెనుక జగన్ ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్‌లో జగన్ ను విచారిస్తే తరువాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా దీనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా..పక్కా ఆధారాలు ఉన్నాయి కనుక సీబీఐ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలో తాను చేసిన అవినీతి, అక్రమాలకు ఏ కేసులోనైనా లోపల వేసే అవకాశం ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను నేరుగా అరెస్టు చేయదని,ఆయనను సీబీఐ లేదా ఈడీలతో అరెస్టు చేయించే అవకాశం ఉందని జగన్ అండ్ కో నమ్ముతున్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేస్తే..కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని జగన్ అండ్ కో నానా యాగీ చేస్తారు..కనుక తన చేతికి మట్టి అంటకుండా..సీబీఐ లేదా ఈడీ చేత అరెస్టు చేయించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఎత్తుగడ కావచ్చు. దీనిని జగన్ అండ్ కో ముందుగానే పసిగట్టింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా నిషేదం విధించారు. అయితే తరువాత వచ్చిన జగన్ సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించారు. గత ఐదేళ్లు అదే జరిగింది. అయితే..ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ సీబీఐకి అనుమతిని ఇచ్చింది. ఈ అనుమతి తమ కోసమే ఇచ్చారని జగన్ అండో కో అప్పుడే నానా యాగీ మొదలెట్టారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, గతంలో ఆయన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చేసి, ఇప్పుడు మరలా ఎందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నిస్తోంది. తమ నేతను అరెస్టు చేయడానికే సీబీఐని మళ్లీ రంగంలోకి తెచ్చారనే అనుమానం వారిలో ఉంది. దీనిపై స్వంత పత్రికలో అప్పుడే కథనాలు మొదలెట్టారు. మొత్తం మీద..సీబీఐ మళ్లీ రాష్ట్రంలోకి రావడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ..రేపటి నుంచి స్వంత పత్రికలో కథనాలు వండుతారు. కాగా..రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి మళ్లీ ఏడాదిపాటు అనుమతి ఇవ్వడంపై రాజకీయవర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. గత ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతిని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా కొన్ని కేసులను సీబీఐ విచారణకు ఇస్తారనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. ముఖ్యంగా లిక్కర్, మైనింగ్ శాఖల్లోజరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరగవచ్చు.