చెయ్యి తడిపితే...చెవుడే...!?
రాష్ట్రంలో సామాజిక ఫించన్లు సొమ్మును భారీగా పెంచడంతో...కొంత మంది అక్రమార్కులు..ఏదో విధంగా వాటిని పొందేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగుల ఫించన్లు పొందడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. గత వైకాపా పాలనలో వైకాపా కార్యకర్తలు,నాయకులు,సానుభూతిపరులు భారీగా అక్రమ ఫించన్లు పొందారు. అర్హత లేకపోయినా..వారు వాలంటీర్లను మచ్చిక చేసుకుని దొంగ సర్టిఫికెట్లు పుట్టించి భారీగా ఫించన్లు పొందారు. ఒక్కో వైకాపా నాయకుని ఇంట్లో కనీసం రెండు మూడు ఫించన్లు పుట్టించారు. వీటిలో వికలాంగ ఫించన్లు, విడో ఫించన్లు, వృద్దాప్య ఫించన్లుతో పాటు, డయాలసిస్, ఎయిడ్స్‌రోగులుకు ఇచ్చే పింఛన్లు కూడా వీరు పొందారు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో భారీ స్థాయిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పొందారు. వాటి నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలను పొందారు. పట్టణాల్లో ఇవి పెద్దగా వెలుగులోకి రాకపోయినా...గ్రామాల్లో మాత్రం ఏ ఇంటి నుంచి ఎవరు అక్రమ ఫింఛన్లు పొందారో...? ఎవరి అర్హత ఎంతో..ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే..అప్పట్లో జగన్ అధికారంలో ఉండడంతో..వారిపై ఫిర్యాదుల వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. వారి పార్టీ వారతై సరే..వేరే పార్టీ వారతై..అర్హత ఉన్నా..ఫించన్లు నిలిపివేశారు. దీన్ని తవ్వి తీస్తే ఇదే పెద్దస్కామ్ అవుతుంది. ప్రభుత్వం సరిగా విచారణ జరిపిస్తే..భారీగా అక్రమాలు బయటకు వస్తాయి. ఇది ఇలా ఉంటే..గత ప్రభుత్వంలో ఇలా జరిగింది కనుక..ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చినందును తమకు కూడా..ఇలానే ఫించన్లు మంజూరు చేయాలని టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, సానుభూతిపరులు తీవ్రంగా యత్నిస్తున్నారు. పలువురు అర్హత లేకున్నా..తమకు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే..వైకాపా వారి ముందు తమ పరువుపోతుందని, ఎలాగైనా..వాటిని స్వంతం చేసుకోవాలనే ధ్యేయంతో వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
సదరన్ సర్టిఫికెట్‌కు రూ.40-50 వేలు...!
ప్రజల నుంచి సదరన్ సర్టిఫికెట్ కోసం తీవ్ర స్థాయిలో ధరఖాస్తులు వస్తూండడంతో..ప్రభుత్వ హాస్పటల్స్‌లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా గిరాకీ ఏర్పడింది. వీరు ఒక్కో సర్టిఫికెట్ కు కనీసం తక్కువలో తక్కువ రూ.40వేలు డిమాండ్ చేస్తున్నారట. ముఖ్యంగా అంగవైకల్యం సర్టిఫికెట్ కోసం వచ్చే వారి వద్ద నుంచి ఎక్కువ మొత్తంలో పిండుతున్నారని ప్రచారం సాగుతోంది. చెవుడు లేకపోయినా ఉన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వడానికి రూ.50వేలు వసూలు చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ హాస్పటల్స్‌లో ఉన్న డాక్టర్లు కొంత మంది ఏజెంట్లు పెట్టుకుంటున్నారు. వీరికి చేయి తడిపితే..ఏదో ఒక అంగవైకల్య సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో గుంపులు గుంపులుగా వ్యక్తులు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పటల్స్‌కు వేలాదిగా వస్తున్నారు. సదరన్ క్యాంపులు లేకపోయినా..సదరన్ టోకెన్ల కోసం ఎగబడుతున్నారు. అనర్హులు భారీగా సదరన్ టోకెన్లు తీసుకుంటుండంతో..నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి గత జగన్ ప్రభుత్వంలో అన్ని అర్హతులు ఉండి కూడా టిడిపి సానుభూతిపరులనో, లేక జనసేన మద్దతుదారులనో..భావించిన వారికి ఈ సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. ఒకవేళ కష్టపడి తెచ్చుకున్నా ఫించన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగిందని, కనీసం ఇప్పుడైనా నిజమైన అర్హులమైన తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే..అనర్హులు భారీగా పోగవుతున్నారని, వీరి వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు.