రాజమండ్రి సెంట్రల్ జైల్ ఇన్‌ఛార్జికి టీటీడీ జేఈఓ పోస్టు...!?
టిడిపి కూటమి ప్రభుత్వం కొన్ని అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. జగన్ హయాంలో ఆయనకు వీరభక్తుల్లా, కట్టప్పల్లా పనిచేసిన కొందరు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసింది. ఎన్నికల సమయంలో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను చంద్రబాబు క్షమించి వదిలేశారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై టిడిపి క్యాడర్, కూటమి కార్యకర్తలు ఆవేశపడినా, చంద్రబాబు వారికి సర్ధి చెప్పారు తప్ప వారిపై కఠిన చర్యలు తీసుకోలేదు. రాజకీయంగా వారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డా, వ్యక్తిగతంగా పరువు పోయినా చంద్రబాబు కొందరు అధికారులపై అవాజ్యప్రేమ చూపారు. అయితే ఇదో కోవలో ఇప్పుడో అధికారిపై ఆయన అవాజ్యప్రేమను చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు అధికారికి కీలకమైన టీటీడీలో జెఇఓ పోస్టు ఇవ్వబోతున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే...చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కక్షకట్టి ఆయనను అరెస్టు చేయించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. ఆయన అరెస్టు అప్పట్లో తెలుగు రాష్ట్రాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న ప్రతిచోటా ఆందోళనకు కారణమైంది. జైలులో చంద్రబాబును శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ప్రచారం జరిగింది. ఆయనకు కనీసం వెస్ట్రన్ మరుగుదొడ్డి కూడా ఇవ్వలేదని, భోజనం సరిగా అందించలేదనే ఆందోళన కరమైన వార్తలు బయటకు వచ్చాయి. వీటన్నిటికీ అప్పటి జైళ్లశాఖ డిఐజీ రవికిరణ్ కారణమని టిడిపి నేతలు ఆరోపించారు. అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎస్.రాహుల్ అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఉండగా ఆయనను సెలవుపై పంపించి జైళ్ల ఐజీగా ఉన్న రవికిరణ్‌ను ఇన్ఛార్జిగా నియమించారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రవికిరణ్ జైల్లో చంద్రబాబును రకరకాలుగా వేధిస్తున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, నక్సలైట్లు, సంఘవిద్రోహశక్తులు ఆయనకు దగ్గరవస్తున్నారని, ఆయన ఉండే బ్యారక్‌పై డ్రోన్‌లు ఎగురవేశారనే వార్తలు వచ్చాయి. వీటన్నింటిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌తో చేయించారని టిడిపి నేతలు ఆరోపించారు.
ఇదంతా గతం..వర్తమానంలోకి వస్తే..అలా చంద్రబాబును వేధించిన రవికిరణ్‌ను టీటీడీ జెఇఓగా నియమించబోతున్నారని, ఆయన నియామకానికి చెందిన దస్త్రాలు సిఎంఓకు చేరాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం ఆ ఫైల్ వెళ్లిందని, ముఖ్యమంత్రి దాన్ని ఆమోదిస్తే...రవికిరణ్‌కు కీలకమైన జెఇఓ పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును జైల్లో అంతగా వేధించిన అధికారికి ఇప్పుడు కీలకమై పదవి ఇవ్వడం ఏమిటి...? జగన్‌కు అత్యంత సన్నిహితుడని ప్రచారం జరిగిన రవికిరణ్‌పై ఇంతటి అవాజ్యప్రేమకు కారణం ఏమిటో..? ఎందుకు ఈ విధంగా దస్త్రం కదిలిందో..తెలియడం లేదని సచివాలయ వర్గాలు అంటున్నాయి. జైల్లో చంద్రబాబుకు రవికిరణ్ సహకరించారని, ఆయనకు ప్రాణహాని లేకుండా చేశారేమో..? అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు కీలకమైన పోస్టు ఇస్తున్నారేమోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మొత్తం మీద..రవికిరణ్ పోస్టింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.