ఉత్తమ సిఎంల్లో 4వ స్థానంలో చంద్రబాబు...!
దేశంలో టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు స్థానం లభించింది. టాప్ ముఖ్యమంత్రుల్లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమానంగా నాల్గవస్థానంలో నిలిచారు. ప్రముఖ ఆంగ్లపత్రిక నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టాప్ 5లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ సింగ్ మొదటిస్థానంలో ఉండగా, తరువాత స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌క్రేజీవాల్‌కు లభించింది. ఆయన గత కొన్నాళ్లుగా అక్రమ మద్యం కేసుల్లో జైలులో ఉంటున్నారు. అయినా ఆయనకు రెండో స్థానం లభించడం విశేషం. తరువాత స్థానం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి లభించింది. నాల్గవ స్థానంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులకు లభించడం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాల్గవ స్థానంలో నిలిచారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడు నెలలు కూడా నిండలేదు. అయితే..రెండున్నర నెలల్లోను ఆయన దేశ ప్రజలను ఆకర్షిస్తున్నారు. మూడు నెలల క్రితం టిడిపి ఆధ్వర్యంలోని కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటున్నారు. వాటిలో భాగంగా సామాజికపెన్షన్లును భారీగా పెంచారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రూ.7వేల రూపాయలు ఫించన్లు అందించారు. అంతే కాకుండా ఉద్యోగులకు ఒకటవ తేదీనే..జీతాలు ఇస్తున్నారు. అదే విధంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి పట్టాలపైకి తెచ్చారు. హామీ ఇచ్చినట్లు ప్రజలకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. అదే విధంగా అన్నక్యాంటీన్లు ప్రారంభించి పేదలకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దగా వైకాపా నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగకపోవడం, అభివృద్దే ఎజెండాగా పనిచేయాలని తన సహచరులకు చంద్రబాబు ఉద్భోదించడం ప్రజలకు ఆయనపై నమ్మకానికి కారణమైంది. మొత్తం మీద చూసుకుంటే పనిచేసే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు.