వైకాపాలో విజయసాయిరెడ్డి వర్గీయులపై వేటు...!?
జగన్ పార్టీలో ఏమి జరుగుతుందో..ఎవరికి తెలియడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత...పార్టీ పెద్దల్లో ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. ముందుగా పార్టీలో జగన్ తరువాత రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిపై ఓ ఉన్నతాధికారి భర్త ఆరోపణలు చేయడం, అది మీడియాలో రచ్చ రచ్చ కావడంతో వైకాపా పరువు పోయింది. ఇలా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేయించింది...పార్టీలోని ఆయన వ్యతిరేకులేని పార్టీలోనే చర్చ జరిగింది. దీని వెనుక పార్టీ అగ్రనాయకత్వం ఉందనే భావన పార్టీలో ఉంది. అయితే..దీన్ని బహిరంగంగా వ్యక్త పరచలేదు. విజయసాయిరెడ్డి మాత్రం తనపై ఆరోపణలు చేస్తోన్నవారికి పార్టీ మద్దతు ఉందని, వారి సంగతి తేలుస్తానని పరోక్షంగా పార్టీ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే..తరువాత విజయసాయిరెడ్డి ఉదంతం మరుగున పడిపోయింది. ఇది ఇలా ఉంటే...పార్టీ పదవుల్లో విజయసాయిరెడ్డి మనుషులకు చోటులేకుండా చేసే ప్రయత్నాలు పార్టీలో లోపాయికారిగా సాగుతున్నాయి. ఇటీవల వరుసగా పార్టీ పదవులను ప్రకటిస్తోన్న అధిష్టానం విజయసాయిరెడ్డి అనుచరులను పక్కన పెట్టేస్తుంది. నిన్న పార్టీ ప్రధానకార్యదర్శులు, వివిధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. దీనిలో గతంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జూపూడి ప్రభాకర్‌రావును తప్పించి ఆ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు అప్పగించారు. జూపూడి లాంటి రాష్ట్ర నాయకున్ని చెప్పాపెట్టకుండా ఎస్సీ సెల్ అధ్యక్షపదవి నుంచి తప్పించేశారు. పోనీ ఆయన కంటే సమర్ధుని నియమించారా..అంటే అదేమీ లేదు. ఎమ్మెల్యేగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భావించి గత ఎన్నికలకు ముందు ఆయనకు జగన్ టిక్కెట్ నిరాకరించారు. అటువంటి సుధాకర్‌బాబును ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమించారు.
వై.ఎస్. వ్యతిరేకి సుధాకర్‌బాబు...!
మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు వై.ఎస్ కుటుంబానికి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. వై.ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సుధాకర్‌బాబు ఢిల్లీలో పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసేవారు. అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కె.కేశవరావుకు మద్దతుతో పార్టీ యువజన విభాగపదవిని పొంది, రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. అటువంటి సుధాకర్‌బాబును ఇప్పుడు కీలకమైన ఎస్సీ విభాగానికి అధ్యక్షునిగా చేశారు. ఇది ఏవిధంగా సరైన చర్య అవుతుందని ఎస్సీ వర్గానికి చెందిన వారు ప్రశ్నిస్తున్నారు.
జూపూడి సేవలు అవసరం లేదా...!?
కాగా మాజీ ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన జూపూడి ప్రభాకర్‌రావు సేవలను పార్టీ వాడుకోవడం లేదా..? ఆయనను ఎందుకు ఎస్సీ సెల్ నుంచి తప్పించారు...? ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో ఎస్సీల్లో కీలకమైన మాల సామాజికవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుంది. ఎస్సీల్లో మెజార్టీలు మాలలే. గతంలో మాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన జూపూడికి మాలల్లో గట్టి పట్టుంది. ఆ వర్గంలో ఉన్న పట్టును గుర్తించే చంద్రబాబు ఆయనను టిడిపిలోకి ఆహ్వానించారు. అయితే..పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో..విజయసాయిరెడ్డి ఆహ్వానంతో ఆయన వైకాపాలో చేరారు. అయితే..ఇక్కడ కూడా ఆయనకు తీవ్ర ఇబ్బందులే ఎదురయ్యాయి. పార్టీ పదవి ఇచ్చినట్లే ఇచ్చి.. లాగేసుకున్నారు. సలహాదారు పదవి ఇచ్చి ఆయన చేత గొడ్డుచాకిరి చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి మద్దతుదారుడనే భావనతో ఉన్న పదవి నుంచి పక్కకు తప్పించారు. వై.ఎస్ కుటుంబానికి వీరవిధేయుడైన జూపూడి గతంలో జగన్‌ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు సీబీఐతో వాదనలకు దిగారు. అర్థరాత్రి దాకా..జగన్‌కు కాపాలా కాసిన అతికొద్ది మందిలో అతనొకరు. అదే విధంగా ఇటీవల విజయసాయిరెడ్డిపై ఆరోపణలు వచ్చినా..ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తోన్న జూపూడిని ఎటువంటి కారణం లేకుండా పక్కన పెట్టారని, ఇది సరికాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కష్టకాలంలో జగన్ వెంట ఉన్న జూపూడి ఇప్పుడు కూడా ఆయన వెంటే ఉంటున్నారు. మేధావిగా పేరున్న జూపూడి సేవలను జగన్ వాడుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్ అవుతోంది. దీన్ని మాల సామాజికవర్గనేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేధావి అయిన జూపూడిని రంగంలోకి దించిరాష్ట్ర వ్యాప్తంగా ఆ వర్గాల ప్రతినిధులతో సదస్సులు నిర్వహిస్తే..వచ్చే ఎన్నికల నాటికి ఆ వర్గంలో వైకాపాకు తిరుగులేని పట్టువస్తుందనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న మద్దతుదారులను కూడగడతారని, రేపు ఎస్సీవర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని ఉద్యమంగా మలచగలిగిన శక్తి ఆయనకు ఉందనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. మేధావి, ఆలోచనాపరుడు, యువతను ఆకట్టుకోగలిగిన శక్తి గల జూపూడిని పక్కకు పెట్టి జగన్ సాధించేదేమిటో తెలియడం లేదని, మళ్లీ సజ్జల మాటలను జగన్ వింటున్నారని, ఇప్పటిదాకా..ఆయన ఘనకార్యాలవల్లే పార్టీకి ఈ స్థితి వచ్చిందని ఇప్పటికైనా..స్వంత నిర్ణయాలను జగన్ తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు.