నోటి దగ్గర కూడు లాగేశాం:అజయ్‌కల్లంరెడ్డి
మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అజయ్‌కల్లంరెడ్డి గత ఐదేళ్ల లో జగన్ ప్రభుత్వం చేసిన పాపాలను పూసగుచ్చినట్లు ఓ టీవీ ఛానెల్‌కు వివరించారు. నాసిరకం మద్యం అమ్మకం, రేషన్ బండ్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఇసుకపాలసీ, ఉద్యోగులు ఇలా ఒకటేమిటి...? గత జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమవ్యవహారాలను విడమర్చి చెప్పారు. తన స్వార్థం కోసం, అవినీతి చేయడానికే జగన్ మద్యంపాలసీని మార్చాడని, మద్యం వ్యవహారంలో తమిళనాడులో అవినీతి జరిగింది కనుక ఇక్కడ కూడా అవినీతి చేయడానికే జగన్ ఆ విధానాన్ని తెచ్చారని అజయ్‌కల్లంరెడ్డి వివరించారు. ఈ విషయంలో తాను కలగచేసుకోబోతే..దాని గురించి తనను మాట్లాడవద్దని జగన్ ఆదేశించారని, దాంతో తాను నోరు తెరవలేకపోయానని ఆయన చెప్పుకున్నారు. మద్యాన్ని ప్రభుత్వమే అమ్మడంతో చాలా మంది ఉపాధి కల్పోయారని, ముఖ్యంగా కొన్ని మద్యం షాపులు నిర్వహించేవారు ఉపాధిని కోల్పోయారని, వారి నోటి దగ్గర కూడును లాగేశామని ఆయన చెప్పారు. అదే విధంగా విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానం కూడా సరిగా లేదని, గతంలో ఉన్న ఫీజులను తగ్గించి మొత్తం తామే కడతామని చెప్పారని, కానీ అదీ సరిగా చేయలేదని, మళ్లీ నడిమధ్య తల్లిని తెచ్చారని, ఆమె ఎకౌంట్‌లో సొమ్ములు వేశారని, దాదాపు 20శాతం మంది కాలేజీలకు ఫీజులు కట్టలేదని, దీంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ విధానాన్ని మార్చాలని చెప్పినా జగన్ వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇంటింటికి రేషన్ అంటూ అవసరం లేని రేషన్ బండ్లను తెచ్చారని, దాని వల్ల ఖర్చు తప్ప ఉపయోగం లేదని, ఇటువంటి అర్థపర్ధం లేని అనేక విధానాలను తెచ్చారని, దాని వల్ల చాలానష్టపోయామని ఆయన చెప్పారు. ఉద్యోగులకు పెద్దగా నష్టం చేయలేదని, కానీ వారిని తీవ్రస్థాయిలో అవమానించారని, దాంతో వారు రగిలిపోయారన్నారు. ఒకటేమిటి దాదాపు 15 అంశాల్లో తీవ్రమైన తప్పులు జగన్ చేశాడని, దాని వల్లే ప్రజలు ఆయనను ఓడించారని అజయ్‌కల్లంరెడ్డి అన్నారు. తనపై చంద్రబాబుకు ప్రేమని కల్లంరెడ్డి చెప్పుకున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు అప్పుడూ, ఇప్పుడూ ఉన్నాయని, చిన్న రాష్ట్రం కనుక పాలనలో వైఫల్యాలు ఎక్కువ ఉంటాయని అన్నారు. మొత్తం మీద..అజయ్‌కల్లంరెడ్డి పదవిలో ఉన్ననాళ్లు ఏమీ చెప్పకుండా, ఇప్పుడు మాత్రం జగన్ పాపాలను ఎకరువు పెడుతున్నారు. ఇప్పుడే ఆయన ఎందుకు ఈ విధంగా నోరు విప్పుతున్నారంటే..రేపటి రోజు కూటమి ప్రభుత్వం జగన్ అవినీతిపై ఆయనను జైలుకు పంపితే, ఆయనతో పాటు..తనను కూడా పంపుతారేమోనన్న భయంతోనే..అజయ్‌కల్లంరెడ్డి తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, కేవలం వారు అడిగినప్పుడు కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చానని చెప్పుకుంటున్నారు. టిడిపికి అనుకూలంగా ఉంటారనే పేరున్న జర్నలిస్టును పిలిపించుకుని ఆయన ఇంటర్య్వూ ఇవ్వడానికి ప్రధాక కారణం కూడా జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలల్లో తన పాత్ర లేదని పరోక్షంగా చెప్పడానికేనని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద..రేపు ఎప్పుడైనా..జగన్ అవినీతిపై విచారణ జరిగితే..అజయ్‌కల్లంరెడ్డి ఆయనకు వ్యతిరేకంగా మారతాడేమో..!చూడాలి..!