ఇబ్బడిముబ్బడి అక్రిడిటేషన్స్ మంజూరుపై విచారణ జరపాలి...!
అలాగే అక్రిటిడేషన్స్ కూడా తమకు ఇష్టమొచ్చినట్లు, దోవనపోయేవారిని కూడా పిలిచి ఇచ్చారే...! ఇక పేపరు కాకపోతే ఫ్రీలాన్స్ జర్నలిస్టు పేరుతో ఇచ్చేశారు. అసలు జీవోలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుల రూల్స్ ఏమిటి? 10 సంవత్సరాలు ఒక న్యూస్ పేపర్‌లో పనిచేసిన అనుభవంతో పాటు, అక్రిడిటేషన్ ఇచ్చేనాటికి సదరు వ్యక్తి జర్నలిజం వృత్తిలో ఉండాలి. దీనితో పాటు 12 న్యూస్ పేపర్ల కటింగ్‌లు అంటే పెద్ద, మధ్యతరహా దినపత్రికల్లో కానీ లేదా మ్యాగ్‌జైన్స్‌వి కానీ ప్రచురించి ఉండాలి. మరి సమాచారశాఖ ఇబ్బడిముబ్బడిగా పంచి పెట్టిన ఫ్రీలాన్స్ జర్నలిస్టులందరికి ఇవి పరిశీలించి ఇచ్చారా..? ఇక వెటరన్ జర్నలిస్టులు, రాష్ట్ర విభజనకు ముందు ఉన్న అక్రిడిటేషన్ కమిటీలో ఉన్న సభ్యులు చాలా సీనియర్స్ అయిన ఎ.బి.కె.ప్రసాద్, రాఘవాచారి,వరదాచారి లాంటి పెద్దలకు అప్లికేషన్ లేకుండానే ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ అధికారం కేవలం రాష్ట్ర స్థాయి సమాచారశాఖ అక్రిడిటేషన్ కమిటీకి మాత్రమే ఉండేది. అలాంటిది, ఈసారి దీన్ని అన్ని జిల్లాలో ఇచ్చేశారు. జీవోలో ఉన్న ప్రకారం 60సంవత్సరాలు నిండిన, లేక 20 సంవత్సరాలు పనిచేసిన వారికి మాత్రమే అక్రిడిటేషన్స్ ఇవ్వాలి. ఇటు ఐ&పిఆర్ కానీ, అటు జిల్లాలో కానీ అక్రిడిటేషన్స్ మంజూరు చేసినప్పుడు ఈ రూల్స్ పాటించారా..?వీటి గురించి క్షుణ్ణంగా విచారణ జరపాల్సి ఉంది. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వాల్సిన ఐ&పిఆర్ డిపార్ట్‌మెంట్ విచ్చిలవిడిగా, రూల్స్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన మాట వాస్తవం కాదా..? జర్నలిస్టులకు స్థలాలు ఇస్తున్నారని, విపరీతంగా ప్రచారం చేసి, అసలు జర్నలిజం అంటే తెలియని వారికి ఎంత మందికి అక్రిడిటేషన్స్ ఇచ్చారో..? ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, వెటరన్ జర్నలిస్టుల పేరిట ఎంత మందికి అక్రిడిటేషన్స్ ఇచ్చారో విచారణ జరిపించాలి. సమాచారశాఖలో జరిగిన ఇటువంటి అన్యాయాలను విచారించడానికి సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ వేస్తే బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే కనుక, సమాచారశాఖ అసలు శాఖలో జరిగిన అవినీతి భాగోతాలపై విచారణ జరుపుతారా..? విజిలెన్స్ నివేదిక బయటకి వస్తుందా...? ప్రభుత్వ అనుమతి లేకుండా ఉడాయించిన పాత కమీషనర్‌ను పిలిపించి విచారణ చేస్తారా..? అనే అనేక అనుమానాలు జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తం అవుతోంది.