అన్నీఆ ఠానులో ముక్కలే...!?
రాజకీయ పార్టీ నేతల్లో పెద్దగా తేడాలు ఉండవనేది అందరికీ తెలిసిన సత్యమే. పార్టీలు, సిద్ధాంతాలు, విధానాలు అన్నీ పైపై వ్యవహారాలే. ఇకప్పుడు సిద్ధాంతాలకు, విధానాలకు, సత్యనిష్టకు రాజకీయపార్టీల నేతలు కట్టుబడి ఉండేవారు. ప్రజల కోసం స్వంత సొమ్మును ధారబోసి, త్యాగశీలురుగా పేరు తెచ్చుకున్నారు. తమకు ఉన్న సర్వం ప్రజల కోసం ఖర్చు పెట్టేవారు. ప్రభుత్వ పదవుల్లో కానీ, పార్టీ పదవుల వ్యవహారంలో కానీ తమ బంధు, మిత్రులకు స్థానం కల్పించేవారు. కాదు..అవన్నీ సత్యం నాలుగుపాదాల్లో నడిచిన రోజుల్లో..ఇప్పుడు వ్యవహారం అలా కాదు..రాజకీయాల్లోకి వచ్చామా..? ఖర్చు చేశామా..? పదవులు సంపాదించామా..? ఆస్తులు పోగేశామా..? ఇది పార్టీలకు అతీతం. ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే..ఆ వ్యక్తితో పాటు..ఆ కుటుంబం మొత్తం ప్రజలపై పెత్తనం చెలాయించాల్సిందే. ఆంధ్రా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. పార్టీలకు అతీతంగా ఈ వ్యవహారం నడుస్తుంటుంది.దీనిలో కుడి, ఎడమ తప్ప పెద్దగా తేడా ఉండదు. నిన్నటి దాకా..ఆంధ్రాలో జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, దిగవస్థాయి నాయకులు ఎడాపెడా ప్రజలను దోచేసుకున్నారు. జగన్ దోపిడీని చూసిన ప్రజలు అమ్మో...ఇతనికి మరోసారి అధికారం ఇస్తే తమను అమ్మెస్తాడనే భయంతో..గతంలో పాలన చేసిన చంద్రబాబే నయమని మరోసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే..ఇక్కడా జగన్‌ను మించిన గజదొంగలు, పెత్తందార్లు, దోపిడీదార్లు ఉన్నారు. అయితే చంద్రబాబు భయంతో వారు కొద్దిగానైనా కట్టడిలో ఉంటారని భావిస్తే, అది నిజం కాదని, వీరు కూడా జగన్ మించిపోతున్నారని తాజాగా జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నారు. అతనికంటే ఘనుడు ఆచంటమల్లన్నట్లు..జగన్ పార్టీ నేతలను మించిపోతున్నారు..టిడిపి ఎమ్మెల్యేలు, వారి బంధుగణాలు. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే సతీమణి వెంకాయమ్మ వ్యవహారం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త వ్యవహారం, తాడిపత్రి జెసి వ్యవహారాలు, పశ్చిమగోదావరి ఎమ్మెల్యే వ్యవహారాలను చూసిన ప్రజలు ఔరా..వీళ్లు జగన్‌ను మించిపోతున్నారని, ముక్కున వేలేసుకుంటున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయయ్మ వివాదాస్పదం అవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పత్తిపాటి మంత్రిగా ఉన్నప్పుడు కూడా అంతా తానై వ్యవహరించారు. అప్పట్లో జిల్లాకు చెందిన అధికారులందరూ ఉదయాన్నే ఆమె ముందు ఠంచ్‌నుగా హాజరు కావాలి. ఎవరెరు ఏ పనులు చేయాలో ఆమే నిర్ధారించేవారు. ఇదే సమయంలో అధికారులనుద్దేశించి పరుషపదజాలాన్ని ఆమే వాడేవారట. అప్పట్లో ఆమె చేసిన వ్యవహారాలను గుర్తు పెట్టుకుని ప్రజలు పత్తిపాటిని ఇంటికి పంపించారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు హవాతో మళ్లీ ఆయన గెలిచారు. అయితే..గతంలో చేసిన తప్పులను దిద్దుకోవడానికి ఆయన ఇష్టపడన్నట్లుంది. కాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. వాస్తవానికి మాధవి భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. ఎన్నికలకు ముందే ఆయన వ్యవహారశైలిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా టిడిపి అథిష్టానం వారికి టిక్కెట్ ఇచ్చింది. అధికారం దక్కిందని, ఇక ఇష్టాసారం వ్యవహారాలు చేయడానికి లెస్సెన్స్ అన్నట్లుంది వారి వ్యవహారం. వీరొక్కరే కాదు..శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మీడియాను బెదిరించడం, జెసి ప్రభాకర్‌రెడ్డి ఇసుకపై చేసిన వ్యాఖ్యలు..ఇలా ఒకరేమిటి చాలా మంది అప్పుడు దుకాణాలు తెరవడం, బెదిరింపులకు, దౌర్జన్యాలకు తెగబడుతుండడంతో..జగన్‌కు వీరేమీ తీసిపోరనే పేరు అప్పుడే వచ్చేసింది. ఎమ్మెల్యేలు వారి బంధువులు వ్యవహారాలపై టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు దృష్టి పెట్టకపోతే..రాబోయే రోజుల్లో జగన్‌కు జరిగిన సన్మానమే వీరికి జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త.